కరోనా మహమ్మారి వ్యాపించడంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు దారుణంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 18 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా చితికి పోతున్న భారతీయులకు మాత్రం ఈ ప్రయోజనం అందడం లేదు.
కరోనా వైరస్ నేపథ్యంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ భారీగానే పడిపోవడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు అమాంతంగా క్షీణిస్తున్నాయి. ధరలు పడిపోతున్న ప్రయోజనాలను వినియోగదారులకు అందకుండా భారత ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కలసి తమ ఆదాయాలను పెంచుకొంటున్నాయి.
చమురు ధరలు తగ్గడంతో ఉన్న ప్రయోజనాన్నికేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకం చెల్లింపులకు దేశీయ చమురు విక్రయ కంపెనీలు సర్దుబాటు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 20 డాలర్లకు పడిపోవడం 2002 నవంబర్ తర్వాత ఇప్పుడే. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ధరలు క్షీణిస్తున్నాయి.
ఇంత ధరలు పతనమవుతున్నభారత్‌లో మాత్రం వరుసగా 14వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతకు ముందు దాదాపు ప్రతి రోజు ధరలను సవరిస్తున్న దేశీయ చమురు కంపెనీలు మార్చ్ 16న చివరిసారి ధరలు సవరించాయి. గత రెండు వారాలుగా అటువంటి ప్రయత్నం చేయడం లేదు.
కాగా మాఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59, ముంబయిలో రూ.75.30గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.62.29, ముంబయిలో రూ.65.21గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 ఉండగా విజయవాడలో రూ.74.32గా ఉన్నది.
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ చమురు వినియోగం ఉంటే… గత కొన్ని వారాలుగా చాలా వరకు తగ్గింది. అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న చమురు ధరలను భారత్‌లో వినియోగదారులకు చేర్చకుండా.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారాన్ని మోపడం ఆదాయ వనరుల పట్ల తప్ప ప్రజల పట్ల దృష్టి సారించలేని ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తుంది.