జగన్‌ కుటుంబంలో చిచ్చు ఆర్కేకు ఎలా తెలుసు..!

ఆంధ్రజ్యోతికి.. వైఎస్‌ ఫ్యామిలీకి ఉన్న శత్రుత్వం ఈనాటిది కాదు. వైఎస్సార్‌‌ బతికున్నప్పటి నుంచే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ.. రాయిస్తూ తనదైన మార్క్‌ జర్నలిజాన్ని నడిపారు. ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పైనా అదే పంథాను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోని లొసుగులు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు రాధాకృష్ణ తన మీడియా ద్వారా జనాలకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వ విషయాల వరకు ఓకే […]

Written By: Srinivas, Updated On : April 4, 2021 10:53 am
Follow us on


ఆంధ్రజ్యోతికి.. వైఎస్‌ ఫ్యామిలీకి ఉన్న శత్రుత్వం ఈనాటిది కాదు. వైఎస్సార్‌‌ బతికున్నప్పటి నుంచే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ.. రాయిస్తూ తనదైన మార్క్‌ జర్నలిజాన్ని నడిపారు. ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పైనా అదే పంథాను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోని లొసుగులు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు రాధాకృష్ణ తన మీడియా ద్వారా జనాలకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వ విషయాల వరకు ఓకే కానీ.. వైఎస్‌ జగన్‌ ఫ్యామిలీలో ఏం జరుగుతోందో కూడా రాధాకృష్ణ బహిర్గతం చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంత పెద్ద ఫ్యామిలీలో ఏం జరుగుతోందో..? రాధాకృష్ణకు ముందే ఎలా తెలుస్తోంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ విషయం ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు.

మొన్నటికి మొన్న అన్న జగన్‌తో షర్మిలకు పొసగడం లేదంటూ వార్త రాశారు. ఆ వెంటనే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారంటూ వార్త వేశారు. ఆ విషయాన్ని వైఎస్‌ జగన్‌, వైసీపీ నేతలు ఖండించినా చివరికి షర్మిల పార్టీ పెట్టడానికే రెడీ అయిపోయారు. అయితే.. ఈ విషయాలన్నీ రాధాకృష్ణ మీడియాలో ముందుగానే ప్రసారం, ప్రచురితం కావడంపైనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాధాకృష్ణకు వైఎస్‌ ఫ్యామిలీ నుంచి ఎవరైనా మిత్రులు ఉన్నారా..? లేకపోతే అంతకుమించిన సోర్స్‌ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా..? తెలియడం లేదు. కానీ.. ఆ ఫ్యామిలీలో చీమ చిటుక్కుమన్నా రాధాకృష్ణకు ఇట్టే తెలిసిపోతోంది.

అయితే.. రాధాకృష్ణ కూడా చాలా విషయాలను రెగ్యులర్‌‌ న్యూస్‌లాగా వేయడం లేదు. వారం వారం వీకెండ్‌లో ఆయన రాసే ‘కొత్తపలుకు’ ద్వారా వైఎస్‌ ఫ్యామిలీపై కథనాలు వడ్డిస్తున్నారు. గతంలోనూ ఆయన ‘కొత్తపలుకు’ ద్వారానే ఇంట్రెస్టింగ్‌ కథనాలను బయటపెట్టారు. తాజాగా.. ఈ వారం కూడా ఆయన ఓ స్టోరీ రాసుకొచ్చారు. జగన్‌ ఫ్యామిలీలో ఏర్పడిన చిచ్చుపైనే ఆ కథనం అంతా సాగింది.

వైఎస్‌ కుటుంబంలో జగనే చిచ్చుపెట్టారని.. ఇప్పుడు ఆ చిచ్చు ఆయననే చుట్టు ముట్టబోతోందనేది ఆ కథనం సారాంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అందరూ ఒకే మాట.. ఒకే బాటగా ఉండే కుటుంబాన్ని జగన్‌ మోహన్ రెడ్డి తన నిర్వాకంతో రెండుగా చీల్చేశాడని.. ఆడవాళ్లందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారని రాధాకృష్ణ విశ్లేషించారు. అయితే.. ఈ కథనం రాయడం వెనుక.. దీనికి కావాల్సిన సరంజామాను ఈసారి వైఎస్‌ సునీత ఇచ్చారని తెలిసింది. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని జగన్ కాపాడుతున్నారని ఆమె వ్యక్తం చేసిన ఆవేదనకు.. మరింత ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్‌తో రాధాకృష్ణ లోతుగా విశ్లేషించారు.

వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో వైఎస్ కుటుంబంలో అందరికీ తెలుసు. అన్ని వేళ్లూ.. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. కానీ.. చర్యలు తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నాన్నకు న్యాయం చేయాలని అడగడానికి వెళ్లిన సునీత జగన్ మోహన్‌ రెడ్డి దగ్గరికి వెళ్తే.. వారిని శిక్షిస్తే వాళ్లు బీజేపీలోకి వెళ్తారని చెప్పారట. దాంతో జగన్ ఎలాగూ కేసును నీరుగారుస్తాడని అర్థమై ఆమె సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లింది. సీబీఐ విచారణకు ఆదేశించినా ముందుకు సాగడం లేదు. అక్కడా మేనేజ్ చేస్తున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ.

ప్రస్తుతం వైఎస్ కుటుంబం అడ్డంగా చీలిపోయింది. షర్మిల వైపు తల్లి విజయలక్ష్మి ఉన్నారు. జగన్ ఎవరినీ దగ్గరకు రానీయకుండా చక్రవర్తిలా సింహాసనంపై కూర్చుని పాలిస్తున్నారు. కుటుంబంలో ఏర్పడిన చిచ్చును కూడా ఆయన లైట్ తీసుకుంటున్నారు. ఎవరు ఉంటే ఏంటి..? ఎవరు లేకపోతే ఏంటి..? అన్నట్లుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఫలితంగా వైఎస్ కుటుంబంలో ఆడపిల్లలు రోడ్డున పడే ప్రమాదం వచ్చింది. చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. తమకేం చేస్తాడని ఇతర ఫ్యామిలీ సభ్యులు జగన్‌పై ఆశలు పెట్టుకోడం మానేశారు. వారంతా షర్మిల వైపు మళ్లుతున్నారు. ఇది త్వరలో పెద్ద చిచ్చుగా మారి జగన్‌ను చుట్టుముట్టే అవకాశం లేకపోలేదంటూ ఆర్కే విశ్లేషించారు.