Internal Differences Between Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ ఇంకా ఎక్కడా ఉండదేమో. ఎంత స్వేచ్ఛ అంటే గ్రూపు రాజకీయాలను కూడా ఎవరినీ లెక్క చేయకుండా చేసేంత. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత అసంతృప్త రాజకీయాలు ఏ రేంజ్లో చెలరేగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు హైకమాండ్ పెళ్లి చెప్పినప్పటికీ కూడా.. చాలా మంది సీనియర్ ల పేరిట ఇలాగే అసంతృప్తి రాజకీయం చేస్తున్నారు.
ఓవైపు సభలు సమావేశాలు నిరసనలు అంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం చాలామంది సీనియర్లు ఇంకా ఇలాంటి తీరు మార్చుకోవట్లేదు. నిన్న మర్రి శశిధర్‌రెడ్డి ఇంట్లో పార్టీ విధేయుల ఫోరం పేరిట జగ్గారెడ్డి, వి.హెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారు దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు.
సరిగ్గా కొల్లాపూర్ లో రేవంత్ సభకంటే ముందు ఈ భేటీ నిర్వహించడం గమనార్హం. వీరి భేటీలో ప్రధానంగా రేవంత్ గురించే చర్చ జరిపినట్టు తెలుస్తోంది. సీనియర్లను, పార్టీ కోసం పనిచేసేవారిని రేవంత్ పట్టించుకోవట్లేదని, అతని మీద ఢిల్లీ అధిష్టానానికి కంప్లయింట్ ఇవ్వాలని వీరందరూ కలిసి నిర్ణయించారు.
నిన్నటి సభలో పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. తమతో చర్చించకుండా ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారంటూ వారంతా మండిపడుతున్నారు. ఇక్కడే మరోసారి కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలు ఎంత నష్టం చేస్తాయో పంజాబ్ లో తెలిసిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన చోట బొక్కబోర్లా పడింది పార్టీ.
మరి గెలుపు కష్టంగా ఉన్న తెలంగాణలో ఇంకెంతలా కలిసికట్టుగా పోరాడాలి. కానీ ఈ విషయాలను పక్కన పెట్టేసి గ్రూపు రాజకీయాలు చేయడం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే చెల్లుతోంది. ఎవరెన్ని చెప్పినా.. ఆ పార్టీలో మాత్రం ఇవన్నీ కామనే అయిపోతున్నాయి. మరి సీనియర్ల మీటింగ్ మీద రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.