
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ఈ నెల 6న ప్రారంభించాలని అనుకున్నా, లెక్చరర్లు ముందుకు రాకపోవడం సమస్యగా మారింది. అయితే, 13నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆరోజు కూడా మూల్యాంకనం ప్రారంభం అనుమానమేనంటున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా నలుమూలలనుంచి, అధ్యాపకులు హాజరు కావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ రెడ్ జోన్, కంటైన్ మెంట్ కొనసాగుతోంది. గుర్తింపు పత్రాలు ఉంటేనే ఇతర ప్రాంతాలనుంచి మూల్యాంకనానికి అధ్యాపకులను అనుమతిస్తారు. వీరికి గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులనుంచి ఎటువంటి ఉత్తర్వులు ఇక్కడికి రాలేదు. దీంతో మూల్యాంకనం ఎప్పటినుంచి ప్రారంభించేది. తాము ప్రకటించే వరకు అధ్యాపకులు హాజరు కావద్దని మెసేజ్ లు పెట్టినట్లు ఆర్ఐఓ సుబ్బారావు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. పరీక్షలు జరుగుతుండగానే కొన్ని సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభించారు. లాక్ డౌన్ ప్రభావంతో వాల్యుయేషన్ వాయిదా పడింది. తాజాగా, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షల తేదీల ప్రకటన రావడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 65 లక్షల వరకు జవాబు పత్రాలు ఉండగా, 55 లక్షల పేపర్లు దిద్దాల్సి ఉంది.
వాల్యుయేషన్ కోసం ఇప్పటికే పాతవి 12 స్పాట్ కేంద్రాలతో పాటు కొత్తగా మరో 21 సెంటర్లను ఏర్పాటు చేశారు. సెంటర్ లోని ఒక్కో రూమ్‌లో 8 నుంచి 12 మంది వాల్యుయేషన్ చేసేలా చూస్తున్నారు. రోజుకు 45 పేపర్లు దిద్దించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. అందుకు 15 వేల మంది లెక్చరర్లను వాడుకోవాలని భావిస్తోంది.