Pawan Kalyan- Gaddar: ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయనకు మంచి పేరు ఉంది. ప్రజా గాయకుడిగా, విప్లవకారుడిగా ఉద్యమ నేతగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హైదరాబాద్ అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్నతర్వాత యావత్ తెలంగాణ ప్రజానీకం, రాజకీయ, సినీ రంగానికి చెందినవారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. గద్దర్ అంటే ఎంతోగొప్పగా అభిమానించేవారు.. ఆయన పార్థీవ దేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా పవన్, గద్దర్ సాన్నిహిత్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జనసేనానికి వాయిస్ మెస్సేజ్..
గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గద్దర్ అపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో తనకు వాయిస్ మెసేజ్ పంపారని.. ఆరోగ్యంతో తిరిగి వస్తారని అనుకున్నా.. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్తారని ఊహించలేదు. భూమి కోసం.. భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం.. తన గళంతో ఉద్యమ స్ఫూర్తినందించి గొప్ప గాయకుడు, కవి గద్దర్ అన్నారు. ఆయన మాటలు సైతం పాటలుగా ఉంటాయి.. పీడిత ప్రజల పక్షాన పోరాడే గద్దర్ అన్న అంటే నాకు ప్రాణం, అలాంటి వారితో ఎక్కువ సమయం గడపడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో స్ఫూర్తి కలిగించారు.. శ్రీశ్రీ తర్వాత గద్దర్ అన్న ప్రభావమే నాపై ఎక్కువగా పడిందని తెలిపారు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం వారి మేలు కోసం పోరాడిన గొప్ప మనిషి. చివరిసారి ఆయన నా పాటకు గాయం అయ్యిందని చెప్పినపుడు ఎంతో బాధపడ్డాను అని భావోద్వేగానికి లోనయ్యారు.
పవన్‌పై ప్రత్యేక అభిమానం..
గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఓ మీడియాలో గద్దర్ మాట్లాడుతూ.. తను అంటే నాకు ఎంతో ఇష్టమని.. నాకు తమ్ముడిలాంటి వాడని అన్నారు. నాకు ఏదైనా ఆర్థిక కష్టాలు ఉంటే నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్ జేబులో చేయి పెట్టి మరీ డబ్బులు తీసుకునే అంత చొరవ ఉంది అని పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కూడా తనను కలిసినప్పుడు ఆయన జేబులో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని తీసి నా జేబులో పెట్టేవాడని తెలిపారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.