Ritesh Agarwal: షార్క్ ట్యాంక్ ఈ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించే రియాల్టీ షోలలో ఇది కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే దాదాపు మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో నాలుగో సీజన్ కూడా ప్రారంభం కానుంది. షార్క్ ట్యాంక్ ఇండియా 4వ సీజన్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి సోనీ లైవ్‌లో ప్రసారం కాబోతుంది. కొత్త షార్క్‌లు, కొత్త హోస్ట్‌తో నయా సీజన్ తిరిగి వచ్చేస్తోంది. అయితే, ఈ షోలో కొత్త షార్క్‌లలో ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రితేష్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓయో హోటల్స్ ఎలా మొదలయ్యాయి? తాజాగా ఓయో హోటల్స్ సీఈవో రితేష్ అగర్వాల్ ఈ షోలో తన వ్యాపార రహస్యాన్ని బయటపెట్టారు. హోటల్ రంగంలో ఓయో విజయానికి కారణం గురించి చెబుతూ, తన సక్సెస్‌కి పూర్తి క్రెడిట్‌ని ఒక్క సినిమాకే ఇచ్చాడు. ఆ సినిమా చూశాక ఓయో హోటల్స్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ “3 ఇడియట్స్ నా లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో ఫాలో యువర్ ప్యాషన్, మనీ ఆటోమేటిక్‌గా మిమ్మలను ఫాలో అవుతుందనే సినిమా సందేశం నిజంగా నా మనసును తాకింది. మీరు మీ అభిరుచిని, ఆలోచనను అనుసరిస్తే విజయం మిమ్మలను ఫాలో అవుతుందని నేను నమ్మాను. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనపై పూర్తిగా నమ్మకం పెట్టాను. అలా ఓయో పుట్టింది. ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఈ వ్యాపారం మొదలు పెట్టాను. వ్యాపారవేత్తలకు నా సలహా ఏమిటంటే ‘డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. మీ అభిరుచిని అనుసరించండి, ఆ డబ్బే స్వయంగా మీ దగ్గరకు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓయో రూమ్స్ పేరుతో రితేష్ అగర్వాల్ కంపెనీని ప్రారంభించారు. దీంతో అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు కూడా తన వ్యాపారాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. ఓయో రూమ్స్ దేశంలోని పెద్ద నగరాల్లో అత్యుత్తమ సౌకర్యాలతో పాటు చౌక ధరలలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీనిని 17 ఏళ్ల ప్రాయంలోనే రితేష్ ప్రారంభించాడు. ఈ రోజు దీని విలువ దాదాపు రూ. 6000 కోట్లకు చేరుకుంది. దీని బుకింగ్‌లు ప్రతి 3 నెలలకు 30 శాతం పెరుగుతున్నాయి. ఇటీవల, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఓయో రూమ్‌లలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇది ఫ్లిప్ కార్ట్ తర్వాత భారతదేశంలో సాఫ్ట్‌బ్యాంక్ రెండవ అతిపెద్ద పెట్టుబడి.
ఈ కంపెనీ వ్యవస్థాపకుడు అయిన రితేష్ అగర్వాల్. 17 ఏళ్లకే ఇంజినీరింగ్ వదిలేసి ఈ కంపెనీని ప్రారంభించారు. ఎవరి సహాయం లేకుండానే ఈ కంపెనీని ప్రారంభించి కేవలం 6 ఏళ్లలో రూ.6000 కోట్లకు చేరుకున్నాడు. ఇంటర్వ్యూలో తను ప్రారంభ రోజుల్లో అద్దె చెల్లించడానికి కూడా డబ్బు లేదని.. మొదట్లో చాలా రాత్రులు మెట్లపై గడిపానని చెప్పాడు. అలాగే అప్పట్లో తను సిమ్ కార్డులను కూడా విక్రయించేవాడు. క్రమక్రమంగా రితేష్ ఒక వెబ్‌సైట్‌ను సృష్టించాడు. అక్కడ అతను చౌకైన హోటళ్ల గురించి సమాచారాన్ని అప్ డేట్ చేస్తుండేవాడు. దానికి అతను ‘ఒరావల్’ అని పేరు పెట్టాడు. వెబ్‌సైట్‌ను కొన్ని రోజులు రన్ చేసిన తర్వాత రితేష్ పేరు కారణంగా వెబ్‌సైట్‌ను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని భావించి, దాని పేరును 2013 లో OYO రూమ్స్‌గా మార్చాడు.
2009లో రితేష్ డెహ్రాడూన్, ముస్సోరీలను సందర్శించడానికి వెళ్లాడు. అక్కడి నుంచే అతనికి ఈ వ్యాపారం గురించి ఆలోచన వచ్చింది. ప్రాపర్టీ యజమానులు, సర్వీస్ ప్రొవైడర్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో పర్యాటకులకు గదులు, ఆహారాన్ని అందించే ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్ సృష్టించాలని అతను ఆలోచించాడు. ఆ తర్వాత 2011లో రితేష్ ఓరవెల్ ను ప్రారంభించాడు. ఈ ఆలోచనతో గుర్గావ్‌కు చెందిన మనీష్ సిన్హా ఒరావెల్‌లో పెట్టుబడి పెట్టి సహ వ్యవస్థాపకుడు అయ్యాడు. దీని తరువాత ఒరావెల్ 2012లో ఆర్థిక బలాన్ని పొందింది. నేడు భారతదేశం అంతటా 8,500 హోటళ్లలో 70,000 కంటే ఎక్కువ గదులు ఉన్నాయి.