https://oktelugu.com/

New Parliament: కొత్త పార్లమెంట్ లో ‘సనాతన ద్వారాలు ‘ ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగరగొట్టిన మోడీ

కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాల ప్రారంభమైన నేపథ్యంలో.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు వేదికగా మారిన కొత్త భవనంలో ఆసక్తికరమైన అంశాలకు కొదవలేదు.

Written By: , Updated On : September 21, 2023 / 12:21 PM IST
New Parliament

New Parliament

Follow us on

New Parliament: “బలవంతమైన నాయకుడు ఉంటే ద్వారాలన్నీ మరింత పటిష్టం అవుతాయి” ఆఫ్రికన్ దేశాలలో ప్రాచుర్యం పొందిన సామెత ఇది. ఇప్పుడు ఈ సామెతను తన చేతల్లో నిజం చేసి చూపిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పటికీ.. ఒక సెక్షన్ మీడియా అడ్డగోలుగా వాదించినప్పటికీ.. ఉదారవాదుల ముసుగులో కొంతమంది ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ మోడీ పట్టించుకోవడం లేదు. ఆయన దారిలో వెళ్తూనే ఉన్నారు.. ట్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో నోట్ల రద్దులో మోడీ అనుకున్న ప్రయోజనాలు నెరవేరకపోగా.. ఆ ప్రభావం కొన్ని రంగాల మీద తీవ్రంగా పడింది. అయినప్పటికీ నరేంద్ర మోడీ ముందుకు వెళుతూనే ఉన్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన 97 సంవత్సరాల నాటి పార్లమెంటు భవనానికి శాశ్వత ముగింపు పలికి.. కొత్త పార్లమెంట్ భవనంలోకి దర్జాగా ప్రవేశించారు మోడీ. ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని టాటా విస్టా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. అయితే ఈ కొత్త పార్లమెంటు నిర్మాణానికి సంబంధించి నరేంద్ర మోడీ సనాతన ధర్మానికి ప్రాధాన్యమిచ్చారు. మొన్న డిఎంకె ఎమ్మెల్యే ఉదయనిధి లాంటివారు నెత్తి మాసిన వ్యాఖ్యలు చేసినప్పటికీ నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. పైగా కొత్త పార్లమెంటు భవనంలో సనాతన ధర్మం పరిడవిల్లేలా చర్యలు తీసుకున్నారు.

కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాల ప్రారంభమైన నేపథ్యంలో.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు వేదికగా మారిన కొత్త భవనంలో ఆసక్తికరమైన అంశాలకు కొదవలేదు. ఇందులో ఉన్న అద్భుతాలను చూస్తే సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించారు. పునాది నుంచి పార్లమెంట్ రూఫ్ వరకు ప్రతి విషయంలో చొరవ తీసుకున్నారు. ఇక కొత్త పార్లమెంట్లో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను గమనిస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. ఆరు దర్వాజలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచారు. ఎందుకు రూపొందించిన శిల్పాలను సైతం చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ప్రతిబింబించేలా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో 6 ద్వారాలు ఉన్నాయి. గజద్వారం, అశ్వద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారా, హంస ద్వారం.

గజద్వారం ప్రత్యేకత ఏమిటంటే పార్లమెంట్ కొత్త భవనం ఉత్తరం వైపు ఉన్న ఈ ద్వారానికి బుద్ధి, సంపద, జ్ఞాపకశక్తి, జ్ఞానానికి ప్రత్యేకగా చెప్పే గజరాజు పేరు దీనికి పెట్టారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తరం బుధ గ్రహంతో సంబంధం ఉంటుంది. ఇది తెలివికి మూలమని వాస్తు పండితులు విశ్వసిస్తారు. రెండవ ద్వారం పేరు అశ్వద్వారం. గుర్రం పేరు మీద ఈ గుమ్మానికి పేరు పెట్టడమే కాదు.. ఈ గుమ్మానికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కించారు. శక్తికి, బలానికి, ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాలు ఈద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు. మూడవ ద్వారం పేరు గరుడద్వారం. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజు. శక్తికి, ధర్మానికి చిహ్నంగా గరుడను చెబుతారు. అనేక దేశాల చిహ్నాలపై గరుడ బొమ్మ ఉంటుంది. తూర్పు ద్వారంగా ఉండే గరుడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. చేపను మకరంగా పిలుస్తారు. మకరం అనేది వివిధ జంతువుల కలయిక. మనదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు నిదర్శనంగా దీనిని ఏర్పాటు చేశారు. పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు మకర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఐదవద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేశారు. దేశ ప్రజల శక్తిని సూచించే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఆరవద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరవ ద్వారంగా ఏర్పాటు చేశారు. ఈ ద్వారాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.