Jalagam Venkatarao: తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత.. నాగార్జునసాగర్ నీళ్లను ఘనత. సోదరుడు మంత్రి. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే.. ఇవి చాలు జలగం వెంకట్రావు గురించి చెప్పడానికి. జలగం వెంకట్రావు మితభాషి. కానీ ఏదైనా విషయం ఆయన దృష్టికి వస్తే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వనమా వెంకటేశ్వరరావు విషయంలోనూ ఆయన అదే చేశారు. తనను ఓడించాడనే బాధ కంటే నియోజకవర్గ ప్రజలను, ఎన్నికల సంఘాన్ని మోసం చేశాడు అనే కసి ఆయనను అడుగు కూడా నిలబడనీయలేదు. అందుకే కోర్టు మెట్లు ఎక్కాడు. ఏళ్లపాటు నిరీక్షించాడు. చివరికి విజయం సాధించాడు. కానీ ఈ నాలుగేళ్ల ప్రయాణంలో జలగం వెంకట్రావు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. మరెన్నో అవమానాలను భరించాడు. చివరికి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు.
కెసిఆర్ చెప్పినప్పటికీ..
కొత్తగూడెంలో ఓడిపోయిన తర్వాత జలగం వెంకట్రావు పెద్దగా దిగులు చెందలేదు. కానీ తన ప్రత్యర్థి తప్పుడు లెక్కలను, సత్య దూరమైన వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందు పరచడమే జలగం వెంకట్రావును కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది.. అయితే జలగం వెంకట్రావు ఆలోచనలను ముందుగానే పసిగట్టిన వనమా వెంకటేశ్వరరావు తాను కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. జలగం వెంకట్రావు కోర్టు దాకా వెళ్లకుండా ఆయన ముందరికాళ్ళకు బంధనాలు వేయించారు. కొత్తగూడెం నియోజకవర్గం లో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించారు. కానీ ఇదేంటని ఏనాడు కూడా జలగం వెంకట్రావు అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. తనను నమ్ముకున్న వారిని దూరం పెట్టలేదు. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నప్పటికీ పలు ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి రైల్వే శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సంబంధిత కాంట్రాక్టర్లకు ఇప్పించాడు. వాస్తవానికి ఈ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది. బాధ్యతగల ఎమ్మెల్యే చేసిన పనికి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు గత్యంతరం జలగం వెంకట్రావును కలవాల్సి వచ్చింది. చివరికి ఆయన రంగంలోకి దిగి బిల్లులు ఇప్పించారు.
నాలుగేళ్లు ఎదురు చూశారు
తనపై వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన నాటి నుంచి దానిని తొక్కిపెట్టేందుకు వనమా వెంకటేశ్వరరావు చేయని ప్రయత్నం అంటూ లేదు. గులాబీ కండువా కప్పుకున్న తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ఆ కేసును నీరు గార్చే ప్రయత్నాలు చాలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకానొక దశలో ముఖ్యమంత్రి ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా చేసిన వనమా.. జలగం అనుచరులను కేసులతో ఇబ్బంది పెట్టారు. భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. అప్పటికి జలగం వెంకట్రావు మౌనాన్ని ఆశ్రయించారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే సామెతను నిజం చేసేందుకు నిరీక్షించారు. నాలుగేళ్ల తర్వాత అదే సామెతను అటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు వనమా వెంకటేశ్వరరావు కుటుంబానికి వాస్తవంలో చూపించారు.
కొత్తగూడానికి కొత్త ఎమ్మెల్యే
హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగూడానికి జలగం వెంకట్రావు కొత్త ఎమ్మెల్యే కాబోతున్నారు.. 2018 నుంచి ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దానిని ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఎన్నికల సంఘం ఎలాంటి సూచనలు ఇస్తుంది? కేవలం ఐదు లక్షల జరిమానా తోనే వనమా వెంకటేశ్వరరావు విడిచిపెడుతుందా? అనేవి తేలాల్సి ఉన్నాయి.