తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది. అంతకుముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్ హనుమంతరావు, జీవన్ రెడ్డి తదితర నేతలు పీసీసీ చీఫ్ పదవి తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపారు. అయితే ఇంటలిజెన్స్ వర్గాల ఆధారంగా సమాచారం తెప్పించుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ కే బాధ్యతలు అప్పగించింది.
అయితే అప్పటి వరకు కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేయొద్దంటూ కొందరు పరోక్షంగా.. మరికొందరు ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేశారు. కానీ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన తరువాత చాలా మంది సైలెంట్ అయిపోయారు. అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తామని కూడా ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి వెంటకరెడ్డి మాత్రం రేవంత్ కు పగ్గాలు ఇవ్వడంపై జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతకుముందు తనకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి వెల్తానని ప్రకటించారు. అయితే రేవంత్ నియామకమైన తరువాత కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పడం గమనార్హం. ఇక తాజాగా కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి చాలా చిన్నదని, రేవంత్ రెడ్డి చిన్న పిల్లోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ పదవి చాలా చిన్నదైతే ఆ పోస్టు కోసం అంతలా ఎందుకు ప్రయత్నించారని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు సీనియర్ నాయకులందరినీ కలిసి ఆహ్వానించారు. విహెచ్ లాంటి సీనియర్ నేతల ఇంటికి వెల్లి మరీ పిలిచారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలను మాత్రం కలువలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కోపంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా..? అన్న చర్చ సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని ఏ విధంగా మచ్చిక చేసుకుంటాడోనన్న ఆసక్తి చర్చ సాగుతోంది.