Homeజాతీయ వార్తలుHeat Waves 2023: ఈ ప్రచండ వేడి వడగాలులకు మనమే కారణం!

Heat Waves 2023: ఈ ప్రచండ వేడి వడగాలులకు మనమే కారణం!

Heat Waves 2023: ఏప్రిల్‌ చివరి రెండు వారాల్లో భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, లావోస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారతదేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 18న అత్యధికంగా 44 డిగ్రీలు, థాయిలాండ్‌లోని టాక్‌ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా 45.4 డిగ్రీలు, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గత దశాబ్దంలోనే అత్యధికంగా ఏప్రిల్‌ 15న 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లావోస్‌లోని సైన్యబులి ప్రావిన్స్‌లో ఏప్రిల్‌ 19న నమోదైన 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఆల్‌టైమ్‌ రికార్డు. ఇలా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. అదీ పొడి వాతావరణం, ఉక్కపోతలతో కూడటంతో అకస్మాత్తుగా వడదెబ్బ కేసులు భారీగా పెరిగాయి.

వడద్బెకు మరణాలు..
వడదెబ్బకు ఏప్రిల్‌ 16న ఒక్కరోజే ముంబయిలో 13 మంది మృతి చెందగా, 60 మంది ఆసుపత్రి పాలయ్యారని అధికారిక సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం 650 మంది ఆసుపత్రుల్లో చేరగా.. మృతుల సంఖ్య కూడా ఎక్కువే. థాయిలాండ్‌లోనూ మరణాలు సంభవించాయి. వడగాలులు, ఎండ తీవ్రత బారిన పడి ఎంతమంది చనిపోయారనేది కొన్ని నెలల తర్వాత గాని కచ్చితంగా తెలియదు. మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏప్రిల్‌లో రికార్డుస్థాయిలో భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, లావోస్‌లో ఉక్కపోతతో కూడిన వడగాలుల (హ్యుమిడ్‌ హీట్‌వేవ్‌) తీవ్రత ప్రభావం సాధారణం కంటే 30 రెట్లు ఎక్కువగా ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

పలు దేశాల్లో అధ్యయనం..
యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), ఫ్రాన్స్, భారత్, నెదర్లాండ్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెన్యా, అమెరికా తదితర దేశాలకు చెందిన 22 మంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌ నుంచి తిరుపతి ఐఐటీకి చెందిన చంద్రశేఖర్‌ బహినిపాటి, ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎస్‌టీæ.చైత్ర, ఉపాసనా శర్మ, అన్సు ఓగ్రా, ముంబయి ఐఐటీకి చెందిన అర్పితా మొండల్, ఐఎండీకి చెందిన అరులాలన్‌ ఉన్నారు. ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశారు. ప్రస్తుతం అధ్యయనం చేసిన ప్రాంతం ప్రపంచంలోనే వడగాలులకు కేంద్రంగా నివేదిక అభివర్ణించింది. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వడగాలులు సాధారణంగా మారడమే కాదు.. ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో గణనీయమైన మార్పు రాకముందుతో పోల్చితే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.

సరాసరి రెండేళ్లకోసారి
భారత్, బంగ్లాదేశ్‌లలో తాజాగా వచ్చిన ఉక్కపోతతో కూడిన వడగాలులు గతంలో సరాసరిన శతాబ్దంలో ఒకసారి కంటే తక్కువే వచ్చేవి. ప్రస్తుతం సరాసరిన అయిదేళ్లకోసారి వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే (కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే.. 30 ఏళ్లలో జరిగే అవకాశం ఉంది) ఇలాంటివి ప్రతీ రెండేళ్లకోసారి చవిచూడాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. లావోస్, థాయిలాండ్‌లో ఇటీవల రికార్డుస్థాయిలో సంభవించిన ఉక్కపోతతో కూడిన వడగాలులు.. వాతావరణంలో మార్పు జరగకపోతే వచ్చేవే కాదని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. ఇప్పటికీ ఇది అసాధారణమని, 200 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వచ్చే అవకాశం ఉండేదని, మానవ ప్రమేయంతో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే సర్వసాధారణంగా మారి 20 ఏళ్లకోసారి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

దక్షిణాసియా.. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో..
దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావం ఎండలో పనిచేసే ప్రజలపై ఎక్కువగా ఉందని, అసమానతలు కూడా ఎక్కువవుతున్నాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలు అవసరమని, నీరు, విద్యుత్తు, ఆరోగ్య రక్షణ అందరికీ అందాల్సి ఉందని పేర్కొంది. వడగాలుల ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలతో ప్రతి సంవత్సరం వేల మంది మరణిస్తున్నారని.. ఆరోగ్య, జీవనోపాధి సమస్యలతో మరింతమంది సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో మరణాలను తక్కువ చేసి చూపుతున్నారని, కొన్ని నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాకే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయని వెల్లడించింది.

భారత్‌లో ఇలా..
భారతదేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల ముందుగానే పాఠశాలలను మూసివేయాల్సి వచ్చిందని.. పశ్చిమబెంగాల్, త్రిపుర, ఒడిశాలలో మూడువారాల ముందుగానే పాఠశాలు మూసివేశారని, ఇదే సమయంలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగాయని వివరించింది. భారత్, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో వడగాలుల తీవ్రత మనుషుల ప్రాణాలు తీసే విపత్తు అయినా.. దీని గురించి సరైన అవగాహన, పరిజ్ఞానం లేకపోవడం వల్ల నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని తిరుపతి ఐఐటీ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ బహినిపాటి అభిప్రాయపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular