https://oktelugu.com/

Ram Column: అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC ) భారత్ కి పెద్ద వరం

Ram Column: అంతర్జాతీయ సంబంధాలలో రవాణా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సింధు-సరస్వతి నాగరికత దగ్గరనుంచి భారత్ విదేశీ వ్యాపారం చేస్తూ వుంది. మెసపటోమియా, గ్రీక్, అరబ్బులతో భారత్ కు వ్యాపారం జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత గుప్తుల కాలం నుంచీ కూడా సముద్రయానం చేసినట్లూ ఆధారాలున్నాయి. అలాగే పర్షియా భూభాగం మీదుగా విదేశీ వ్యాపారం సాగింది. రోమన్లు కూడా భారత్ తో వ్యాపారం చేశారు. ఒకానొక దశలో క్లియోపాత్రా భారత్ కు పారిపోవాలని ప్రయత్నం చేసింది. అతి […]

Written By:
  • Ram
  • , Updated On : August 18, 2022 / 09:34 AM IST
    Follow us on

    Ram Column: అంతర్జాతీయ సంబంధాలలో రవాణా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సింధు-సరస్వతి నాగరికత దగ్గరనుంచి భారత్ విదేశీ వ్యాపారం చేస్తూ వుంది. మెసపటోమియా, గ్రీక్, అరబ్బులతో భారత్ కు వ్యాపారం జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత గుప్తుల కాలం నుంచీ కూడా సముద్రయానం చేసినట్లూ ఆధారాలున్నాయి. అలాగే పర్షియా భూభాగం మీదుగా విదేశీ వ్యాపారం సాగింది. రోమన్లు కూడా భారత్ తో వ్యాపారం చేశారు. ఒకానొక దశలో క్లియోపాత్రా భారత్ కు పారిపోవాలని ప్రయత్నం చేసింది. అతి ప్రాచీన చర్చి( ప్రపంచంలోనే రెండోదిగా చెప్పబడే చర్చి) కొచ్చిన్ కి ఉత్తరాన వుంది. ఇస్లాం మత స్థాపన తర్వాత అతి తక్కువ సమయంలోనే అరబ్బు వ్యాపారులు మలబారు తీరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే యూదులు, పార్సీలు చాలా పురాతన కాలంలోనే గుజరాత్ తీరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక తూర్పు ప్రాంతంలోనయితే ఈనాటి ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం, కొరియా దాకా భారత్ ప్రభావం విస్తరించిందని మనందరికీ తెలుసు.

    INSTC

    ఇదంతా ఇప్పుడెందుకంటే విదేశీ వ్యాపారం భారత్ కి బాగా తెలిసిన విద్య నే. అదేదో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం నేర్చుకున్నది కాదు. అప్పట్లోనే విదేశీ వ్యాపారం ఉంటే ఈ అధునాతన ప్రపంచంలో విదేశీ వ్యాపారం లేకుండా ఒక్క రోజు గడవదు. అది భూ మార్గంలో, వాయు మార్గంలో, సముద్ర మార్గంలో జరుగుతుందని మనందరికీ తెలుసు. ఇందులో రవాణా విషయంలో ఈ రోజుకు అధిక వ్యాపారం జరిగేది సముద్ర మార్గంలో, ఆ తర్వాత భూమార్గంలో. కాకపోతే భూమార్గంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు మనకు పాకిస్తాన్ తో సత్సంబంధాలు లేవు. అందువలన పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా లాంటి దేశాలకు మనం భూ భాగం ద్వారా రవాణా చేయలేము. అలాగే తూర్పున ఆగ్నేయాసియా కూడా భూ భాగం ద్వారా వ్యాపారం చేయలేకపోతున్నాం. దానికి ముఖ్యంగా అదునాతన రవాణా వ్యవస్థ లేకపోవడం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి?

    Also Read: Ram Column: బ్రాహ్మణ, బనియా ముద్ర నుంచి సామాజికన్యాయ దిశగా బీజేపీ పరివర్తన

    ఇప్పటివరకు మనకు ప్రధానంగా రెండే దారులున్నాయి. ఒకటి పశ్చిమ తీరం నుంచి హిందూమహాసముద్రం మీదుగా ఎర్రసముద్రం ద్వారా సూయెజ్ కాల్వ ద్వారా మధ్యధరా సముద్రం మీదుగా ; రెండోది, తూర్పు తీరంనుంచి మలక్కా జలసంధి ద్వారా. ఇవి రెండూ అతి రద్దీ మార్గాలు. ముఖ్యంగా సూయెజ్ కాల్వ మార్గం. ఉదాహరణకు యూరప్, రష్యాకి ఈ మార్గం నుంచే వెళ్ళాలి. చివరకు మనకు దగ్గరగా వున్న మధ్య ఆసియా కు కూడా. దీనివలన భారత్ వ్యాపారంలో వెనకబడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొంటుంది. ఇది సెయింట్ పీటర్స్ బర్గ్ రేవు నుంచి భారత్ కు రావాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. బాల్టిక్ సముద్రం నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా జిబ్రాల్టర్ జలసంధి దాటి మధ్యదరా సముద్రం, సూయెజ్ కాల్వ మీదుగా ఎర్ర సముద్రం దాటి హిందూమహాసముద్రం ద్వారా మన పశ్చిమ తీరం రావాలి. 21వ శతాబ్దం లో 40 రోజులు చాలా ఎక్కువ. మరి ఏమిచేయాలి? అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వచ్చింది.

    2000 సంవత్సరంలో భారత్-ఇరాన్-రష్యా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి మాస్కో, వోల్గాగ్రాడ్ మీదుగా కాస్పియన్ సముద్రపు తీరానికి రైల్ మార్గం ద్వారా వచ్చి అక్కడనుంచి కాస్పియన్ సముద్రం ద్వారా దక్షిణాన వున్న ఇరాన్ తీరం అంజలికి వస్తే అక్కడనుంచి రోడ్డు మార్గం ద్వారా ఇరాన్ లో పయనించి పర్షియన్ ఖాతం లోని బందర్ అబ్బాస్ పోర్టుకి వచ్చి అక్కడనుంచి ముంబై కి ఓడల ద్వారా రవాణా జరిగేటట్లు. దీన్నే అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా నడవ ( ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ) సింపుల్ గా INSTC అంటారు. ఈ మార్గం ఇటీవలే పని చేయటం మొదలయ్యింది. దీని దూరం 7200 కిలోమీటర్లు. ఇది 40 రోజుల బదులు 25 రోజుల్లోనే సరకు రవాణా చేస్తుంది. రెండోది దీనికయ్యే ఖర్చు సంప్రదాయ మార్గం కన్నా 30 శాతం తక్కువ. ఇందుకోసం భారత్ 2.1బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది.

    INSTC

    గత 3 నెలలనుంచి ఈ మార్గం పనిచేస్తుంది. దీనికోసం ఇరాన్ షిప్పింగ్ లైన్స్ 300 వాహనాల్ని సమకూర్చింది. ఇప్పటికే ఈ మార్గం ద్వారా 3 వేల టన్నుల సరుకులు, 114 కంటైనర్లు సరఫరా అయ్యాయి. ఈ మార్గం పూర్తి వినియోగంలోకి వస్తే సమయం, ఖర్చు తగ్గటమే కాకుండా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒక్క రష్యాతోనే కాదు మధ్య ఆసియా, తూర్పు యూరప్, పశ్చిమ యూరప్ కి కూడా రవాణా చేయొచ్చు. దీనిలో ఇంకో 10 దేశాలు కూడా భాగస్వామ్యమయ్యాయి. ఇది పూర్తి వినియోగంలోకి వస్తే ఇక పాకిస్తాన్ తో మనకు సంబంధం లేదు. ఒకవిధంగా ఇది చైనా బి ఆర్ ఐ కి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. అలాగే చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా పెట్టుబడికి తగ్గ రాబడి ఉండదు. అందుకని చైనా కూడా ఆ నడవాని ఆలస్యం చేసే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ INSTC నడవా బందర్ అబ్బాస్ పోర్టుకి చేరి అక్కడనుంచి ముంబై కి సముద్రమార్గం ద్వారా వస్తుంది. అయితే భారత్ చాబహార్ ఓడరేవుని వినియోగించుకుందామని ఇరాన్ కి ప్రపోజల్ పెట్టింది. చాబహార్ ఓడరేవుకి భారత్ ఆర్ధిక సహాయం చేయటం తెలిసిందే. ఇదే కార్యరూపం దాలిస్తే మనకు ఇంకా సమయం కలిసి రావటమే కాకుండా ఆఫ్గనిస్తాన్ కి కూడా రవాణా నడవ ఏర్పడుతుంది. అక్కడనుంచి మధ్య ఆసియా కు తక్కువ సమయం లో వెళ్లొచ్చు. పాకిస్తాన్ తో సంబంధం లేకుండా అన్ని పశ్చిమ, మధ్య ఆసియా, రష్యా, యూరప్ లతో విదేశీ వ్యాపారం తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేయొచ్చు. ఇది భారత్ కు గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు. కాకపోతే ఇందులో ముఖ్యమైనది ఇరాన్ దేశంతో సత్సంబంధాలు. ఈ మొత్తం నడవాకి కీలకం ఇరాన్ భూభాగం. భారత్ కు ఇరాన్ తో సత్సంబంధాలే వున్నాయి.

    bloomburg

    దీనితోపాటు 2019 లో మోడీ-పుతిన్ లు ఇంకో ఒప్పందం చేసుకున్నారు. అది రష్యా తూర్పు తీరం వ్లాదివోస్టాక్ నుంచి చెన్నై కి సముద్ర నడవా. దీనిప్రకారం రష్యా తూర్పు తీరం నుంచి క్రూడాయిల్, గ్యాస్ భారత్ తూర్పు తీరానికి చేరేటట్లు. ఇది ఆచరణలోకి వచ్చినా భారత్ కి ప్రయోజనం చేకూరుతుంది. కాకపొతే భారత్ తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో లాగా రిఫైనరీలు ఎక్కువ లేవు. సామర్ధ్యం కూడా తక్కువే. కాబట్టి తూర్పు తీరంలో మౌలిక సౌకర్యాల కల్పన వేగంగా జరిగినప్పుడే ఈ ఒప్పందం ఫలితాన్ని పొందగలం. ప్రస్తుతం 11 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని 2025 కల్లా 30 బిలియన్ డాలర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండింటిలో INSTC ( అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా నడవా) ప్రారంభం కావడం చాలా సంతోషం. ఈ నడవా లో భాగమైన ఇరాన్ కారిడార్ ఇంకా పటిష్టమయితే దీని పూర్తి ప్రయోజనం భారత్ కి వస్తుంది. మొత్తం మీద ఇది మన విదేశీ వ్యాపారం లో ఒక గేమ్ చేంజర్ గా మిగలటం ఖాయం

    — రామ్

    Also Read:Private Medical Colleges Telangana: తెలంగాణలో అమ్మకానికి ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. వైద్య విద్య కూడా ఇంజనీరింగ్ లాగా మారుతోందా?

    Tags