Siang Hydro Power Project: బ్రహ్మపుత్ర.. నదులన్నింటికీ ఆడ పేర్లు ఉండే మనదేశంలో పురుష నామంతో ప్రవహించే ఏకైక జీవనది ఇది. కైలాస శిఖరానికి సమీపంలోని యాంగ్సీ హిమానీ నదంలో పుట్టి.. టిబెట్ యార్లాంగ్ సాంగ్పోగా ప్రవహించి భారత సరిహద్దులు దాటి అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా.. అస్సాంలో దిహాంగ్ నదిగా బిర బిర పరుగులు పెడుతూ.. మరో రెండు ఉపనదుల కలయికతో బ్రహ్మపుత్రగా మారి.. మళ్లీ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ లోకి ప్రవహించి.. మరికొన్ని నదీపాయలను కలుపుకొని జమునగా మారి, గంగతో కలిసి చివరికి బంగాళాఖాతంలో కలిసే నది ఇది. ఈ నదిపై చైనా ఇప్పటికే టిబేట్ భూభాగంలో బయు, డాగు, జిక్సు, జంగ్ము, జియాచా, లెంగ్డా, జెంగ్డా, లాంగ్ జెన్ అనే 8 జల విద్యుత్ కేంద్రాలను నిర్మించింది. ఇవన్నీ చిన్న చిన్నవి. వాటన్నింటినీ తలదన్నే విధంగా.. గతంలో తమ దేశంలోనే యాంగ్జి నదిపై నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం త్రీ గోర్జెస్ కన్నా రెండు నుంచి మూడు రెట్లు పెద్దదైన ఆనకట్టను, 60 గిగా వాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని టిబెట్ లోని మెడాగ్ నిర్మించ తలపెట్టింది.
భారీ సొరంగాలు తవ్వి ప్రాజెక్టు నిర్మించాలి అనేది చైనా ఉద్దేశం. అయితే ఈ ప్రాంతం భూ కంప జోన్. పెను భూకంపాలు సంభవించి చైనా కట్టిన డ్యాముల్లో ఏది దెబ్బతిన్నా .. దాని ప్రభావం మిగతా వాటిపై ప్రమాదం చాలా ఎక్కువ. అదే జరిగి ఆ డ్యాముల కట్టలు తెగితే దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ లో చాలా ప్రాంతాల్లో జలప్రళయం సంభవిస్తుంది.. అలాంటి ప్రకృతి విపత్తులు సంభవించుకున్నా.. చైనా తన విభాగంలోని ఉత్తరాది ప్రాంతాల్లో నీటి కరువును తీర్చుకునేందుకు ఈ నది నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తే భారత్, బంగ్లాదేశ్లో ప్రవాహమే ఉండదు. ఒకవేళ భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా కావాలని నీటిని పెద్ద ఎత్తున విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జలమయిపోతాయి. ఇలా చేయడాన్ని జలయుద్ధంగా వ్యవహరిస్తారు.
చైనా డ్యామ్ ప్రతిపాదన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై “అప్పర్ సీయాంగ్ మల్టీ పర్పస్ స్టోరేజ్” నిర్మించాలని భావిస్తోంది. 900 కోట్ల మీటర్ల నీటిని నిల్వచేసే జలాశయంలా దీనిని డిజైన్ చేశారు. ఒకవేళ చైనా గనుక టిబెట్ నుంచి నీటిని తన దేశానికి తరలించుకపోతే.. ఈ జలాశయంలోని నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర పై ఆధారపడిన ప్రాంతాలకు సరఫరా చేయవచ్చు. లేదా చైనా పై నుంచి నీటిని విడుదల చేస్తే ఈ జలాశయంలో ఒడిసి పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. “చైనా ప్రాజెక్టు నేపథ్యంలో సియాంగ్ లేదా బ్రహ్మపుత్ర నదిని బతికించుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో పలు దశల్లో చర్చలు జరిగాయి. పై నుంచి పెద్ద ఎత్తున నీరు విడుదలైనప్పుడు మనల్ని మనం ఆ వరదల బారి నుంచి కాపాడుకునేందుకు పెద్దపెద్ద నిర్మాణాలు కావాలి. అందుకే కేంద్రం ఈ నదిపై బరాజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది” అని పెమా ఖండు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల దీని సర్వే కోసం వెళ్తే స్థానికులు అడ్డుకున్న నేపథ్యంలో.. ఆయన అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. చైనా భారీ డ్యాం కు విరుగుడుగా తలపెట్టిన అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి జాతీయ జల విద్యుత్ కేంద్ర కార్పొరేషన్ ప్రీ ఫీజబిలిటీ నివేదికను భారత కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థకు సమర్పించింది. నిర్మాణం పూర్తయితే ఈ దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం అవుతుంది. దీని ద్వారా 11 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని నిర్మాణానికి దాదాపు 1.13 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.