India vs Pakistan Asia Cup Match Effect: క్రీడలు అంటే గెలుపు ఓటములు సమానం. ఆడుతున్నంతసేపే భావోద్వేగాలు ఉంటాయి. ఆ తర్వాత చప్పున చల్లారిపోతాయి. కానీ క్రికెట్ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ భారత్ మ్యాచ్ వేరు. అది ఏ టోర్నీ అయినా కూడా భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి. బెట్టింగులు జోరుగా సాగుతుంటాయి. మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తలపడిన మ్యాచ్ లను డిస్నీ హాట్ స్టార్ లో కోట్లాదిమంది జనం చూశారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అయితే మొదటి మ్యాచ్లో భారత్ గెలిచింది. కీలకమైన సూపర్_4 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇది అంతటితో ఆగితే బాగుండు. కానీ ఈ మ్యాచ్ ప్రభావం వల్ల తెలుగు ప్రవాసీయులు అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోతున్నారు. సౌదీ అరేబియా దేశంలో పని నచ్చక తిరిగి వస్తున్నారు.

కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో ముస్లిం దేశాలతో భారత దౌత్య విధానం అంతత మాత్రం గానే ఉంది. పైకి పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా.. లోపల నివురుగప్పిన నిప్పు అలానే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వచ్చి, చేస్తున్న పని నచ్చక తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్న కొంతమంది తెలుగు ప్రవాసీయులకు ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఓటమి చెందడం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమంది యువకులు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతానికి రెండు నెలల క్రితం వచ్చారు. పారిశుద్ధ్య విభాగంలో పని చేసేందుకు కుదిరారు. అయితే అక్కడ ఉన్న సువిశాలమైన క్యాంపుల్లో కొన్ని వేలమంది దక్షిణాసియా దేశాల కార్మికులు ఉంటున్నారు. రోడ్లను శుభ్రం చేసేందుకు వచ్చిన వీరిని ఆ పని కాకుండా, చెత్త సేకరించే పనికి ట్రక్కుల్లో పంపుతున్నారు. పైగా పని ప్రదేశాలకు తీసుకెళ్ళేటప్పుడు ట్రక్కుల్లో కుక్కి కుక్కి పంపుతున్నారు. దీనివల్ల చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. అదికాకుండా నచ్చని పని చేయిస్తున్నారు. అధ్వానమైన భోజనం పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు రోడ్లను శుభ్రం చేసే పని మాత్రమే కావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే రోడ్లను శుభ్రం చేస్తే అరబ్బుల నుంచి దయాదాక్షిణ్యాలు, టిప్పులు, బంగారం దాదాపు జీతం కంటే ఎక్కువగా దొరుకుతాయని వీరి ఆశ. ఉన్న ఊళ్ళో అప్పులు ఎక్కువ కావడంతోనే సౌదీ వచ్చామని, ఇక్కడ కూడా అత్తెసరు సంపాదన ఉంటే అప్పులు ఎలా తీర్చాలని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Different Fathers : కవలలు… తల్లి ఒకరే గానీ, తండ్రులు వేరు. ; ఈ వింత ఎలా సాధ్యమైంది!
ఆ మ్యాచ్ ఎంత పని చేసింది
నాలుగు రోజుల క్రితం దుబాయిలో ఆసియా కప్ టోర్నీలో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే పాకిస్తాన్ కార్మికులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే వారంతా రాత్రిపూట వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతుండగా.. ఓ నేపాల్ కార్మికుడు అభ్యంతరం తెలిపాడు. దీంతో వారంతా మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మరుసటి రోజు నుంచే ఈ వ్యవహారం మతం రంగు పులుముకుంది. నేపాల్ కార్మికుడు తమ దేశాన్ని, మహమ్మద్ ప్రవక్తను దూషించాడని పాకిస్తాన్ కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేని భారత కార్మికులపై పాకిస్తాన్ కార్మికులు దాడికి దిగడంతో వారంతా ఆత్మ రక్షణలో పడ్డారు. అయితే పాకిస్తాన్ కార్మికులు తమను పని ప్రదేశంలో వేధిస్తున్నారని, ఇలాగైతే తాము ఈ పని చేయలేమని భారతీయ ప్రవాసీయులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారతీయ కాన్సులేట్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. అసలే నచ్చని పని, పైగా పాకిస్తాన్ కార్మికులు వేధింపులకు గురి చేస్తుండటంతో తమను స్వదేశానికి పంపించాలని భారతీయ కార్మికులు వేడుకుంటున్నారు. కార్మికుల ఫిర్యాదు నేపథ్యంలో భారతీయ కాన్సులేట్ అధికారి గురువారం మదీనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరపగా మహమ్మద్ ప్రవక్తను దూషించిన సంఘటనలో భారతీయ కార్మికులకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులకు వెల్లడించారు. దీంతో వారు భారతీయ కార్మికులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల గాయి గాయి చేసిన సౌదీ అరేబియా.. ఇప్పుడు పాకిస్తాన్ కార్మికులు చేసిన పనికి ఏం సమాధానం చెబుతుందని పలువురు భారతీయ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్తాన్ కార్మికులపై సౌదీ అరేబియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో భారతీయ కాన్సులేట్ విభాగం ఆసక్తిగా గమనిస్తోంది.
Also Read:Ravi Prakash- Ambani Telugu Channels: అంబానీల తెలుగు ఛానెల్ హెడ్ గా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్?
[…] […]
[…] […]