Kavach System Train: అశ్విని వైష్ణవ్ చెప్పిన కవచ్… రక్షణ కవచం ఎందుకు కాలేదు?

Kavach System Train: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Written By: K.R, Updated On : June 3, 2023 2:47 pm

Kavach System Train

Follow us on

Kavach System Train: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 230 మృతదేహాలను వెలిగితే చామని రైల్వే అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదంతా ఒక కోణమైతే.. ఇంతటి ప్రమాదం జరిగేందుకు కారణాలు ఏమైనప్పటికీ.. వీటి నిరోధానికి ” కవచ్” లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ఎందుకు ఇంతటి దారుణం జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

2022లో తెర పైకి కవచ్

రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఉన్నప్పుడు అవి ఢీకొట్టుకోకుండా ఉండేందుకు కేంద్ర రైల్వే శాఖ 2022లో “కవచ్” అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి అంతటి సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రమాదాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయిందనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగిలింది. రైల్వే శాఖ వర్గాల ప్రకారం టెక్నాలజీ అనేది పూర్తి ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. కేంద్ర రైల్వే శాఖ దీనిని 400 కోట్లు ఖర్చు చేసి అమల్లోకి తీసుకువచ్చింది. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఈ టెక్నాలజీ ని ట్రాకులకు అమర్చేందుకు కేటాయింపులు కూడా జరుపుతోంది. ఒడిశాలో జరిగిన ప్రమాదంలో మూడు రైళ్లు ఢీ కొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ఆ మార్గంలోని రైలు పట్టాలకు ఎందుకు అమర్చలేకపోయింది? అసలు ఆ మార్గంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం లేదా? అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు.

కవచ్ అంటే ఏంటంటే

కవచ్ అంటే.. కవచం అని అర్థం. ప్రమాదాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని భారతీయ రైల్వే అప్పట్లో అభివర్ణించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రెండు రైళ్లు ఒకే ట్రాక్ లో వస్తూ ఉంటే ఆటోమేటిగ్ గా ఆగి పోయేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. రైళ్ళను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపిస్తుంది. అందువల్ల రైళ్ళు ఢీకొనవు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తీస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే లో ఇప్పటికే 1455 రూట్ కిలోమీటర్లు సాంకేతిక పరిజ్ఞానం తో కవర్ అయ్యాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాల్లో టెక్నాలజీ అమలుకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలా పనిచేస్తుందంటే

రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రమాదాలు ఆపేందుకు రైలు రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇందులో ఇంజన్లో క్యాబ్ లో సెట్ చేసిన స్క్రీన్ పై ప్రతి సిగ్నల్ కనిపిస్తుంది. రైలు ఎంత వేగంగా వెళ్తుంటే లోకో పైలట్లు స్క్రీన్ పై చూస్తారు. ఇది కూడా రైలు ప్రమాదాలు జరగకుండా ఆపుతుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ రైలు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. ఇక కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ సమీపంలో జరిగింది. కోరమాండల్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 బోగీలు పట్టాల తప్పాయి. వీటిలో నాలుగు బోగీలు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.