Indian Railways Fine Collection : మనుషులు అన్నాక అందరూ ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో వ్యసనం ఉంటుంది. కొంతమంది అదే పనిగా చాయ్ తాగుతూ ఉంటారు. కొంతమంది ఇష్టానుసారంగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇంకొంతమంది యుద్ధం ప్రకటించినట్టుగా సిగరెట్లు కాల్చుతూ ఉంటారు. ఇంకొంతమంది తమ నోటిని గానుగ ఆడించినట్టు ఆడిస్తూ ఉంటారు. అందులో తంబాక్, గుట్కా, కైనీ వంటివి నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? తాము అదే పనిగా నములుతూ.. ఉమ్మి వేస్తూ ఉంటే ఇబ్బంది పడరా.. అనే వాటిని ఏమాత్రం పట్టించుకోరు. పైగా నోటి నిండా గుట్కా వేసుకుని గానుగ ఆడించినట్టు ఆడిస్తూ నములుతుంటారు. ఎక్కడపడితే అక్కడే ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పరిసర ప్రాంతాలు దుర్గంధంగా మారుతుంటాయి. అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఈస్టర్న్ రైల్వే శాఖ ఒక వినూత్న విధానానికి రూపకల్పన చేసింది.
Also Read : చీనాబ్ వంతెన నిర్మాణంలో 17 ఏళ్ల శ్రమ.. ఎవరీ ప్రొఫెసర్ మాధవి లత? తెలంగాణతో ఏం సంబంధం?
భారతీయ రైల్వే శాఖ గత కొంతకాలంగా రైళ్లను, స్టేషనులను అత్యంత గొప్పగా ఆధునికరిస్తున్నది. వాటిని శుభ్రంగా ఉంచుతోంది. అయితే కొంతమంది గుట్కా రాయుళ్లు రైల్వే శాఖ ప్రయత్నాన్ని నాశనం చేస్తున్నారు. రైల్వే శాఖ ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ వారు ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు కొంత మంది ప్రయాణికులు కూడా గుట్కా తింటూ ఉమ్మి వేస్తున్నారు. గోడలను పాడు చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వారికి ఏ స్థాయిలో అవగాహన కల్పించినప్పటికీ ఉపయోగము ఉండడం లేదు. దీంతో ఈస్టర్న్ రైల్వే శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మూడు నెలల్లోనే రైల్వేస్టేషన్ల లో ఉమ్మి వేసిన వారి వద్ద నుంచి దాదాపు 32 లక్షలు అపరాధ రుసుము రూపంలో వసూలు చేసింది. ఇలాంటి పని మరొకసారి చెయ్యొద్దని హెచ్చరించింది.
గుట్కా రాయుళ్లు అదేపనిగా ఉమ్మి వేయడం వల్ల రైల్వే స్టేషన్ లలో గోడలు పాడవుతున్నాయి. పరిసర ప్రాంతాలు అద్వానంగా మారుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. దీనికి తోడు విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉండడమే కష్టతరంగా మారుతుంది. గుట్కా రాయుళ్ల వల్ల ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కోట్లు ఖర్చుపెట్టి డెవలప్మెంట్ పనులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. అందువల్లే ఈస్టర్న్ రైల్వే శాఖ గుట్కా రాయుళ్లపై చర్యలకు దిగింది. ఏకంగా 32 లక్షల ను అపరాధ రుసుముగా విధించింది. అయినప్పటికీ కొంతమంది గుట్కా రాయుళ్లు మారడం లేదు. అపరాధ రుసుము చెల్లించినా వారిలో ఏమాత్రం తప్పు చేసిన భావన కనిపించకపోవడం విశేషం. అయితే అలాంటి వారిని గుర్తించి రైళ్లల్లో ప్రయాణం చేసే అవకాశాన్ని దూరం చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.