సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ భారతీయ సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నిపారని, భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ప్రశంసించారు. అమర జవాన్లకు సాయంపై సీఎం కేసీఆర్‌ ఔదార్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కి ఒక లేఖ రాశారు. ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న పవార్‌.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చైనా సరిహద్దులో అమరుడైన సూర్యాపేట వీరయోధుడు కర్నల్‌ […]

Written By: Neelambaram, Updated On : June 27, 2020 7:16 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ భారతీయ సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నిపారని, భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ప్రశంసించారు. అమర జవాన్లకు సాయంపై సీఎం కేసీఆర్‌ ఔదార్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కి ఒక లేఖ రాశారు. ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న పవార్‌.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చైనా సరిహద్దులో అమరుడైన సూర్యాపేట వీరయోధుడు కర్నల్‌ సంతోష్‌ బాబు కూడా కోరుకొండ సైనిక్ స్కూల్‌ లో విద్యనభ్యసించారు. కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన వెంటనే ఆయన కుటుంబానికి మీరు అండగా నిలిచిన తీరు, ఉదారంగా సహాయం ప్రకటించడం, దాన్ని వెంటనే అమలుచేయడం అపూర్వం, అనితర సాధ్యం’ అని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు.

మాతృభూమి రక్షణలో భారత సైనికుడు ప్రాణత్యాగానికి సైతం ఎన్నడూ వెరవడన్న వాస్తవాన్ని చరిత్ర అనేకమార్లు రుజువు చేసిందన్నారు వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌. జాతీయ యుద్ధస్మారకంపై మెరిసే అమరుల పేర్లు, ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌ కారిడార్లలో వెలిసిన శౌర్యపతాక విజేతల చిత్రపటాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి సాహసిక సైనికుల రుణాన్ని జాతి ఎలా తీర్చుకోవాలన్న దానికి మీరు ఈ రోజు ఒక ఉదాహరణలా నిలిచారని సీఎం కేసీఆర్ పై  ప్రశంసలు కురిపించారు. మీరిచ్చిన భరోసా ఈరోజు యుద్ధ సరిహద్దుల్లో నిలిచిన మన జవాన్ల ఆత్మబలాన్ని రెట్టింపుచేసిందని లేఖలో పేర్కొన్నారు. నాకేమైనా అయితే నా కుటుంబాన్ని చూసుకునేందుకు నా జాతి ఉంది అనే ఆత్మ విశ్వాసాన్ని సైనికుల్లో కలిగించారని .. ఇందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు” అంటూ సీఎం  కేసీఆర్‌ పై నౌకాదళాధికారి ప్రశంసల వర్షం కురిపించారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలను, ఒక నాయకుడిగా ఆయనలో ఉన్న ఆర్ద్రతను కూడా వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో ప్రస్తావించారు. సైనికుడు అమరుడైన ప్రతిసారీ ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి, ఒక ముఖ్యమంత్రి వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఊరుదాకా వెళ్లకపోవచ్చు. వెళ్లడం సాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ మీరొక ముందడుగు వేసారని సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి సాయం ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మీరు స్వయంగా సూర్యాపేటదాకా వెళ్లి, ఆయన భార్యకు మీ చేతులతో అందజేయడం మాత్రం అపూర్వమన్నారు. ఇది మీ నాయకత్వ లక్షణాలకు, ఔదార్యానికి, ఆర్ద్రతకు, మానవత్వానికి నిదర్శనమని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు . కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు అమరులైన 19 మంది సైనికులకు, వారు తెలంగాణకు చెందిన వారు కానప్పటికీ, ఉదారంగా సాయం చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిందన్నారు. ఆర్మీ పట్ల, సైనికుల పట్ల మీకున్న అవగాహనకు ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదని సీఎం కేసీఆర్‌ను నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసించారు.

సైనికులకు ఉదాత్తమైన సాయం అందడంలో సీఎం కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత కీలక పాత్ర పోషించి, విశేషమైన కృషి చేశారని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు. తాను, కర్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ను ఒకసారి సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్ ను పవార్‌ ఆహ్వానించారు. “కోరుకొండ స్కూల్లో తెలంగాణ పిల్లలు కూడా అనేకమంది చదువుకుంటున్నారని తెలిపారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదువుకున్న ఎంతోమంది అనేకరంగాల్లో దేశవిదేశాల్లో రాణిస్తున్నారని..  అందువల్ల మీరొక్కసారి ఆ స్కూలును తప్పక సందర్శించాలని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పలికారు.