spot_img
Homeజాతీయ వార్తలుPM Modi Security: ప్రధాని సెక్యూరిటీలో ఇండియన్‌ బ్రీడ్‌ డాగ్స్‌.. వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

PM Modi Security: ప్రధాని సెక్యూరిటీలో ఇండియన్‌ బ్రీడ్‌ డాగ్స్‌.. వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

PM Modi Security: ప్రధాని భద్రత అంటేనే శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. బ్లాక్‌ కమాండోస్‌.. రెప్పపాటులో కదిలే చురుకైన ఫోర్స్‌. కంటి రెప్ప వాల్చని ఎస్‌పీజీ బలగాలు ఉంటాయి. ఇంతటి సెక్యూరిటీలోకి మరో రక్షణ కవచం చేరింది. అవే ముధోల్‌ హౌండ్‌ జాతికి చెందిన ఇండియన్‌ బ్రీడ్‌ డాగ్స్‌. స్వాతంత్య్ర భారత చరిత్రలో ప్రధాని భద్రతలో డాగ్స్‌ చేరండం ఇదే మొదటిసారి. ఆ ఘనత ఇండియన్‌ బ్రీడ్‌కు చెందిన ముధోల్‌ హౌండ్‌ జాతికి దక్కింది.

కర్ణాటక ఈ జాతికి ప్రత్యేకం..
ముధోల్‌ హౌండ్‌ జాతి కుక్కలు కర్ణాటకలోని బాగన్‌ హాట్స్‌ జిల్లా ముధోల్‌ ప్రాంతంలో ఈ శునకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి శక్తి సామర్థ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సన్నగా, పొడుగ్గా బక్కచిక్కినట్లుగా ఉంటాయి. కానీ, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతూ శత్రువులను చీల్చుతాయి. ఎత్తయిన గోడలు, ప్రదేశాలను కూడా అవలీలగా ఎక్కగలగడం వీటి మరో ప్రత్యేకత.

వాసన పసిగట్టడంలో దిట్ట..
ఇక వాసన పసిగట్టడంలో ముధోల్‌ హౌండ్‌ జాతి శునకాలు నేర్పరులు. వీటి ముందు జర్మన్‌ షఫర్డ్‌ జాతి కుక్కలు కూడా దిగదుడుపే. సాధారణంగా అందరూ జర్మన్‌ షఫర్డ్స్‌నే వాసన పసిగట్టి నేరస్తులను పట్టుకుంటాయని భావిస్తుంటారు. కానీ వాటికంటే వాసన పసిగట్టే శక్తి సామర్థ్యాలు ముధోల్‌ హౌండ్‌ జాతి కుక్కలకు ఎక్కువ అని ఇటీవల నిర్ధారించారు.

ఇండియన్‌ ఆర్మీ, ప్రధాని సెక్యూరిటీలోకి..
ఇంతటి శక్తి, సామర్థ్యాలు ఉన్న ఈ ముధోల్‌ హౌండ్‌ జాతి శునకాలు ఇప్పుడు ఇండియన్‌ ఆర్మీతోపాటు, ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీలోకి కూడా ఇవి ప్రవేశించాయి. ఒక భారత దేశ సెక్యూరిటీలో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి దేశీయ శునకాలుగా ముధోల్‌ హౌన్స్‌ గుర్తింపు పొందాయి.

పోలీస్‌ విభాగంలో శునకాలు కీలక పాత్ర..
శునకాలు పోలీస్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరాలను ఛేదించడంలో నేరస్తులను పట్టించడంలో పోలీసులకు సహకరిస్తాయి. ముధోల్‌ హౌండ్‌ జాతి కుక్కలు కూడా చాలా తెలివైనవి. ప్రధాని నరేంద్రమోదీ 2020లో తన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో కర్ణాటక ప్రత్యేక జాతిగా పరిగణించబడుతున్న దేశీయజాతి కుక్క ముధోల్‌ హౌండ్స్‌ గురించి ప్రస్తావించారు. 2018లో కూడా ఓ ర్యాలీలో ప్రధాని ఈ దేశీయ జాతి కుక్కల గురించి పేర్కొన్నారు.

ప్రధాని ప్రశంసతో గుర్తింపు..
ప్రధాని మోదీ ప్రశంసతో కర్ణాటకకు చెందిన ఈ ప్రత్యేక జాతి కుక్కలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వీటికి డిమాండ్‌ కూడా పెరిగింది. దేశ సరిహద్దుల్లో పహారా, నేరస్థులను పట్టుకోవడం తదితర అన్ని పనుల కోసం ఈ జాగిలాలను సైన్యంలో చేర్చుకుంటున్నారు. నేరస్థులను గుర్తించడంలో ముధోల్‌ హౌన్స్‌ దిట్ట. మిగతా జాతుల కుక్కల కంటే అత్యంత వేగంగా పరిగెత్తడం వీటి ప్రత్యేకత. మొదటి సారిగా ఈ ముధోల్‌ హౌండ్‌ జాతి కుక్కలను బీఎస్‌ఎఫ్‌ స్పెషల్‌ టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బందీపూర్‌ అటవీశాఖ బృందంలో చేర్చారు.

కళ్లు ప్రత్యేకం..
ఇక ముధోల్‌ హౌండ్స్‌ జాతి జాగిలాలు వాటి కళ్లను 240 డిగ్రీల నుంచి 270 డిగ్రీల వరకు తిప్పగలవు. వేడి వాతావరణ పరిస్థితులను కూడా ఇవి తట్టుకుంటాయి. స్వదేశీ జాతుల్లో ఇది పొడవైన కుక్క. 72 సెంటీ మీటర్ల పొడవు, 20 నుంచి 22 కిలోల వరకు బరువు ఉంటుంది. రెప్పపాటులో చిరుతలాంటి వేగాన్ని అందుకుంటాయి.

ముధోల్‌ రాజ్యం నుంచి పేరు..
ఈ జాతి కుక్కలకు ముధోల్‌ హౌండ్‌ అని పేరు రావడానికి పూర్వపు ముధోల్‌ రాజ్యమే కారణమని చెబుతారు. ఇవి చూడడానికి బలహీనంగా కనిపిస్తాయి. వేటలోకి దిగితే మాత్రం చీల్చిపడేస్తాయి. ఒక్కసారి టార్గెట్‌ ఫిక్స్‌ అయితే ఇక అంతే.. అంతు చూసే వరకు వదలవు. ఈ జాతిలో ఒక ఆడకుక్క ఏడాదిలో 2 నుంచి 14 వరకు పిల్లల్ని కంటుంది. వీటి ధర కూడా చాలా తక్కువ. ఒక్కో కుక్క పిల్లను రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. వ్యాక్సిన్లు వేయించి సర్టిఫికెట్‌తో కావాలంటే రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ కుక్కలు 16 ఏళ్లు బతుకుతాయి.

బ్రిటిష్‌ రాజుకు కానుకగా..
ముధోల్‌ కుక్కలను మొదట రాజా మాలోజిరావు గోర్పడే దృష్టిని ఆకర్షించాయి. గిరిజనులు వీటిని వేట కోసం ఉపయోగించేవారు. గోర్పడే రాజు బ్రిటన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అప్పటి బ్రిటీష్‌ రాజు 5వ జార్జ్‌కు కొన్ని ముధోల్‌ హౌండ్‌ జాతి కుక్కలను బహుమతిగా ఇచ్చాడట. ఛత్రపతి శివాజీ సైన్యంలోనూ ముధోల్‌ కుక్కలను వాడినట్లు తెలుస్తోంది. ఈ కుక్కలు కర్ణాటకలోని ముధోల్‌ తాలూకాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ శునకాలను పెంచుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular