Bhairav Battalions: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ త్రివిధ దళాల బలోపేతంపై మరింత దృష్టిపెట్టింది. మన సైనిక శక్తి ప్రపంచానికి తెలియడంతో సరికొత్త ఆయుధాలతోపాటు సరికొత్త సైన్యాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది. సమకాలీన యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘‘భైరవ్ బెటాలియన్లు’’ రూపుదిద్దుకున్నాయి. సైన్యంలో ఇదో కీలక పరిణామం. ఆధునిక పరికరాలు, స్మార్ట్ సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ యూనిట్లు అత్యంత వేగంగా స్పందించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 1న తొలి భైరవ్ దళం రంగప్రవేశం చేస్తుంది. ఇప్పటికే ఐదు యూనిట్లు శిక్షణ దశలో ఉండగా, మరో 20 పైగా సిద్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
భైరవ్ ప్రత్యేకత ఏమిటి..?
భైరవ్ యూనిట్ల ప్రధాన లక్ష్యం – సాధారణ పదాతిదళాలు లేదా ప్రత్యేక బలగాలు నేరుగా వీలుపడనప్పుడు వ్యూహాత్మకంగా సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వర్తించడం. ఒక్కో యూనిట్‌లో 250 మంది అత్యంత నిపుణులైన జవాన్లు, 7–8 మంది అధికారిస్థాయి నాయకత్వంతో ఉంటారు. వీరు శత్రు భూభాగంలో లోతుగా ప్రవేశించే తక్షణ దాడులు, ఆపరేషన్లు, సీక్రెట్ మిషన్‌లు నిర్వర్తించగల నేర్పు కలిగి ఉంటారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ, క్రియాశీలత, సమర్థత పరంగా వీరి ప్రాధాన్యం ఎంతో ఎక్కువ.
సైన్యం పునర్‌వ్యవస్థీకరణలో కీలకం..
భైరవ్ దళాల ప్రవేశం భారత సైన్యంలో మారుతున్న రణరీతులను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం బలంపై కాకుండా టెక్నాలజీ, వేగం, గూఢచారి సమాచారంపై ఆధారపడతాయి. ఈ యూనిట్లు వీటన్నింటిని సమన్వయం చేస్తూ భవిష్యత్ యుద్ధరంగానికి సరైన మోడల్‌గా నిలుస్తాయి. దేశ భద్రతా వ్యవస్థలో ఇవి ఒక కొత్త అధ్యాయం ఆరంభమనే చెప్పాలి.
భైరవ్ బెటాలియన్లు భారత రక్షణ వ్యవస్థలో సంస్కరణాత్మక మార్పుకు సూచిక. ఇవి శత్రు ప్రాంతాల్లో తక్షణ చర్యకు ప్రత్యేక యాంత్రిక మానవ శక్తుల్లా పనిచేస్తాయి. ఇలాంటి యూనిట్లు సైన్యంలో చేరడం భవిష్యత్తు సమర వ్యూహాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధమైందని చెప్పవచ్చు.