India Vs Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్–పాక్ సంబంధాలలో మరోసారి ఉద్రిక్తతను రేకెత్తించింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని భారత్ ఆరోపించింది. ఈ ఘటన తర్వాత, భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, పాకిస్థాన్‌లోని 11 కీలక వాయుసేన స్థావరాలపై మే 9–10, 2025 అర్ధరాత్రి అత్యంత ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడులు స్వదేశీ ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులతో నిర్వహించబడ్డాయి, ఇందులో సుఖోయ్ యుద్ధ విమానాలు మరియు బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయని సమాచారం.
Also Read: కుర్చీ కాపాడుకోవడం కోసం కశ్మీర్‌ను తురుపుముక్కగా మార్చిన ఆసిం మునీర్!
పాక్ అణు స్థావరాల టార్గెట్..
భారత్ దాడులలో ఒకటి పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ వాయుసేన స్థావరం సమీపంలో జరిగింది, ఇది పాకిస్థాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చాలా దగ్గరగా ఉంది. ఈ స్థావరం పాకిస్థాన్ అణ్వాయుధాల నిల్వ, నియంత్రణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమీప దాడి భారత సైనిక సామర్థ్యాన్ని, పాక్ అణు ఆయుధాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని రాండ్ కార్పొరేషన్‌కు చెందిన సైనిక విశ్లేషకుడు డెరెక్ జే గ్రోస్మన్ అభిప్రాయపడ్డారు. ఈ దాడి ‘పాకిస్థాన్ అణు ఆయుధాలపై భయపడే ప్రసక్తే లేదు‘ అనే సందేశాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చిందని ఆయన తెలిపారు. సర్గోదాలోని కిరానా హిల్స్ వాయుసేన స్థావరం, జకోబాబాద్, సుక్కూర్, పస్రూర్, సియాల్కోట్, స్కర్దు, చునియాన్, మరియు భోలారీ స్థావరాలపై కూడా భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడులలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన 20% మౌలిక సదుపాయాలు, ఎఫ్–16, జేఎఫ్–17 యుద్ధ విమానాలు, మరియు డ్రోన్లు ధ్వంసమయ్యాయని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. భోలారీ స్థావరంపై జరిగిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్‌తో సహా 50 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించినట్లు పాకిస్థాన్ పత్రిక ’డాన్’ నివేదించింది.
కాల్పుల విరమణకు కారణాలు..
పాకిస్థాన్ సైనిక నాయకత్వం ఈ దాడుల తీవ్రతకు వణికిపోయి కాల్పుల విరమణకు ఒప్పుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ దాడులు పాకిస్థాన్ అణు ఆయుధ సామర్థ్యంపై ప్రత్యక్ష బెదిరింపును సూచించాయి, ఇది పాక్ సైనిక నాయకత్వంలో ఆందోళనను రేకెత్తించింది. ఈ సందర్భంలో, పాకిస్థాన్ తమ అణు ఆయుధ భద్రతపై అమెరికాతో ఉన్న దీర్ఘకాలిక అవగాహన ఒప్పందాన్ని ఆశ్రయించినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొన్న కథనం సూచిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ అణు ఆయుధాల భద్రతకు అమెరికా హామీ ఇచ్చింది, మరియు ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ వెంటనే వాషింగ్టన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
అమెరికా జోక్యం..
గతంలో భారత్–పాక్ ఘర్షణలను పెద్దగా పట్టించుకోని అమెరికా, ఈసారి వెంటనే రంగంలోకి దిగడం గమనార్హం. భారత్ దాడులు పాకిస్థాన్ అణు సామర్థ్యంపై సూచించిన బెదిరింపు, దక్షిణాసియాలో అణు యుద్ధం యొక్క సంభావ్యతను పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని, ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు భారత్, పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరిపింది. ఈ జోక్యం ఫలితంగా, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా జోక్యం వెనుక మరో కారణం దక్షిణాసియాలో స్థిరత్వాన్ని కాపాడటం. పాకిస్థాన్ అణు ఆయుధాలు ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదాన్ని అమెరికా ఎప్పటి నుంచో గమనిస్తోంది. భారత్ దాడులు ఈ ప్రమాదాన్ని మరింత పెరొత్తించాయని, అందుకే అమెరికా వెంటనే జోక్యం చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ లక్ష్యం ఉగ్రవాదమే..
భారత్ దాడుల లక్ష్యం ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం అయినప్పటికీ, పాకిస్థాన్ సైనిక స్థావరాలపై జరిగిన ఈ కచ్చితమైన దాడులు దేశ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. కేవలం మూడు గంటల్లో 11 స్థావరాలపై దాడులను పూర్తి చేయడం భారత సైన్యం యొక్క సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ దాడులలో నూర్ఖాన్ స్థావరం, రఫీఖీ, మురీద్ వంటి కీలక స్థావరాలు లక్ష్యంగా చేయబడ్డాయి, ఇవి పాక్ వైమానిక దళం యొక్క మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉన్నాయి.