UN Population Report 2022: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా సరికొత్త రికార్డుకు భారత్ రేరువవుతోంది. ఏడాదిలో మనం చైనాను దాటేయబోతున్నాం. ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంగ్రీగా అవతరించబోతున్నాం. ఇది ఎవరో చెప్పింది కాదు.. ఐక్యరాజ్య సమితి స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని తెలిపింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత దేశ ప్రస్తుత జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2023లో భారతదేశం చైనాను అధిగమిస్తుంది. 2050 నాటికి ఇండియా జనాభా 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. అదే సమయంలో చైనా జనాభా క్రమంగా తగ్గి 131.7 కోట్లకు పరిమితం అవుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఆరోగ్య రంగంలో సాధించిన అద్భుత ప్రగతి..
ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయిని దాటడం మానవ సమాజం ఆరోగ్య రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతికి నిదర్శనం అని యూఎన్‌వో సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. అయితే, జనాభా విస్ఫోటం నుంచి భూ గ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిపై ఉందని తెలిపారు.
Also Read: Tollywood Couples: కలిసున్నారా ? విడిపోయారా ? అయోమయంలో ఉన్న సినిమా జంటలు ఇవే

ఆయుర్ధాయం 72.8 ఏళ్లు..
ప్రపంచ సగటు ఆయుర్ధాయం 72.8 ఏళ్లకు పెరిగినట్లు యూఎన్‌వో తన నివేదికలో పేర్కొన్నది. 1990లో ప్రపంచ ఆయుర్దాయం 63.8 ఏళ్లుగా ఉంది. 2050 నాటికి ఇది 77.2కు పెరుగుతుందని అంచనా వేసింది. 1950 నుంచి చూస్తే జనాభా పెరుగుదల రేటు 2020లోనే అతి తక్కువగా ఉందని యూఎన్‌వో వెల్లడించింది. ప్రపంచ జనాభా 2030లో 850 కోట్లకు, 2050లో 970 కోట్లకు, 2080లో 1,040 కోట్లకు చేరి, అక్కడి నుంచి 2100 వరకు నిలకడగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న 30 ఏళ్లలో పెరిగే ప్రపంచ జనాభాలో సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాల్లోనే(డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా) ఉంటుందని తెలిపింది.
Also Read:Meteorological Analysis : తెలంగాణలో వచ్చే మూడు రోజులు డేంజర్..వాతావరణ హెచ్చరిక