ఇప్పుడు భారత్ లో కొనసాగుతున్నంత కరోనా ఉధృతి.. ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. రోజుకు సుమారు మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విజృంభణ రోజురోజుకూ పెరుగుతోందే తప్ప, తగ్గే సూచనలు కనిపించట్లేదు.
కొవిడ్ ఉగ్రరూపం ఇలా ఉంటే.. వైద్య సదుపాయల డొల్లతనం అందరికీ తెలిసి వస్తోంది. రెమ్ డెసివర్ ఇంజక్షన్లు మొదలు.. ఆక్సీజన్ వరకు ఏ సౌకర్యం కూడా సరిగా అందుబాటులో లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరక్క బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. పరిస్థితి విషమించి వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఇలాంటి కష్టకాలంలో భారత్ కు తాము అండగా ఉంటామని ప్రకటించింది రష్యా. స్వాతంత్ర కాలం నుంచీ భారత్-రష్యా మైత్రి కొనసాగుతోంది. ఎన్నో సార్లు.. ఎన్నో విధాలుగా ఆ దేశం మనకు సహకారం అందించింది. ఇప్పుడు ఈ కరోనా దారుణ పరిస్థితుల్లో మరోసారి స్నేహ హస్తం చాచింది రష్యా.
కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్ డెసివర్ ఇంజక్షన్లతోపాటు, ఆక్సీజన్ ను సరఫరా చేస్తామని ప్రకటించింది ఆ దేశం. వారానికి సుమారు 4 లక్షల రెమ్ డెసివర్ టీకాలు సరఫరా చేస్తామని తెలిపింది. ఈ టీకాలతోపాటు ఆక్సీజన్ సిలిండర్లను కూడా అందిస్తామని ప్రకటించింది.
ఈ విషయమై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే.. రాబోయే 15 రోజుల్లో దిగుమతులు మొదలవుతాయని తెలుస్తోంది. నౌకల ద్వారా వీటిని తరలించనున్నారు.