India Indo-Pacific Strategy: ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలు చైనాకు దీర్ఘకాలంలో గణనీయమైన ఆందోళనలను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చైనా సైనిక–ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత్ చేస్తున్న కదలికలు దాని శక్తి సమతుల్యతను భవిష్యత్తులో సవాలు చేసే అవకాశం ఉంది. ఈ చర్యలు కేవలం రక్షణ సహకారంతోనే కాకుండా, సముద్ర మార్గాలు, వనరులు మరియు ప్రాంతీయ భాగస్వామ్యాల ద్వారా చైనాను ఇరకాటంలో పెడుతున్నాయి.
ఇండోనేషియాతో సత్సంబంధాలు..
భారత్ ఇండోనేషియాతో తన సంబంధాలను వేగంగా మెరుగుపరుస్తోంది. అధునాతన క్షిపణుల సరఫరా ద్వారా రక్షణ సహకారం పెంచుతూ, ఇండోనేషియాను ప్రాంతీయంగా చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతోంది. ఇండోనేషియా తన ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న సమయంలో, భారత్ నుంచి వస్తున్న ఈ మద్దతు వాళ్లకు వ్యూహాత్మకంగా బలం చేకూరుస్తోంది. ఇండోనేషియా భారత్‌ను మరింతగా ఆదరిస్తోంది. ఇండోనేషియాలోని కొంతమంది ముస్లింలు మోదీ పట్ల వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలతో భారత్ యొక్క సంబంధాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ ద్వైపాక్షిక సహకారం రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
మలక్కా జలసంధి చైనాకు కీలకం..
అండమాన్ నికోబార్ దీవులు, ఇండోనేషియాకు చెందిన నటునా దీవుల మధ్య ఉన్న మలక్కా జలసంధి చైనాకు అత్యంత కీలకమైనది. చైనా యొక్క చమురు దిగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యం మెజారిటీ భాగం ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తాయి. ఈ ప్రాంతంలో భారత్ తన పట్టును బలపరుస్తూ, ఖనిజ వనరులు సముద్ర మార్గాలపై నియంత్రణ సాధిస్తోంది. ఇది చైనాకు దీర్ఘకాలంలో పెద్ద సంక్షోభం కలిగించే అవకాశం ఉంది. శత్రుత్వం ఉన్న సమయంలో ఈ మార్గాన్ని నిరోధించడం లేదా పర్యవేక్షించడం చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భారత్ చర్యలు చైనాకు షాక్ ఇచ్చే వ్యూహాత్మక అడుగులుగా మారుతున్నాయి.
అండమాన్ నికోబార్, ఇండోనేషియా లింక్..
అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ భారీగా మౌలిక సదుపాయాలు, సైనిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ఇది ఇండోనేషియాకు చెందిన సభాంగ్ పోర్టుతో లింక్ అవుతూ, మలక్కా జలసంధి చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతంలో భారత్ పర్యవేక్షణ ప్రభావాన్ని పెంచుతోంది. ఈ రెండు దీవుల సమూహాలు చైనాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. భారత్ ఈ ప్రాంతంలో తన ఉనికిని బలపరుస్తున్నందున, చైనా సముద్ర మార్గాలు మరింత దుర్బలంగా మారే ప్రమాదం ఉంది. ఇది రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలపరుస్తోంది.
యాక్ట్ ఈస్ట్ పాలసీ..
భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో–పసిఫిక్ విజన్, ఆగ్నేయాసియా సంబంధిత కాన్సెప్ట్‌లు చైనాను ఇరకాటంలో పెడుతున్నాయి. ఈ విధానాలు కేవలం ఆర్థిక సహకారంతోనే కాకుండా, రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ సమతుల్యతను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఇవి చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహాన్ని సవాలు చేస్తూ, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ యొక్క సంబంధాలను బలపరుస్తున్నాయి. ఫలితంగా, చైనా తన ప్రాంతీయ ప్రభావాన్ని నిలబెట్టుకోవడం కష్టతరం అవుతోంది.
గాల్వాన్ తర్వాత మారిన దృక్పథం..
గాల్వాన్ సంఘర్షణ నుంచి భారత్ చైనాను శత్రువుగానే చూస్తోంది. ఈ మార్పు రక్షణ, విదేశాంగ విధానం, సముద్ర వ్యూహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చైనా శక్తివంతమైన దేశంగా ఉన్నప్పటికీ, ఈ వ్యూహాత్మక చర్యలు దీర్ఘకాలంలో చైనాకు అతిపెద్ద సంక్షోభం కలిగించే అవకాశం ఉంది.
భారత్ చర్యలు కేవలం చైనాకు భయం కలిగించడమే కాకుండా, ఆగ్నేయాసియా ప్రాంతంలో సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతం అవుతాయనేది రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది.
