India Economy Ranking 2025: భారతదేశ ఆర్థిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ఏప్రిల్ 2025 నివేదిక ప్రకారం.. భారతదేశం 2025లో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ విషయంలో భారత్, జపాన్‌ను అధిగమించింది. నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరానికి (FY26) భారతదేశ నామమాత్రపు GDP 4,187.017 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జపాన్ GDP 4,186.431 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పేర్కొంది. ఈ స్వల్ప తేడాతో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. 2024 వరకు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది.
Also Read: చుట్టూ శత్రువలే.. అయినా ఇప్పటి వరకూ ఓటమెరుగని దేశం.. ఇజ్రాయెల్ విజయరహస్యమిదీ
ముందంజలో అమెరికా, చైనా
2025లో కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలు (30,507.217 బిలియన్ డాలర్లు), చైనా (19,231.705 బిలియన్ డాలర్లు) ప్రపంచంలో మొదటి రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా కొనసాగనున్నాయి. రాబోయే మరో పదేళ్లలో కూడా ఈ స్థానాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేస్తోంది.
మూడో స్థానంపై గురి
భారత్ రాబోయే సంవత్సరాల్లో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. 2028 నాటికి భారతదేశ GDP 5,584.476 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, జర్మనీ GDP 5,251.928 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. 2027లో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని, అప్పుడు GDP 5,069.47 బిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
2025లో ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు (GDP – బిలియన్ డాలర్లలో):
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు – 30507.217
2. చైనా – 19231.705
3.జర్మనీ – 4744.804
4. భారతదేశం – 4187.017
5. జపాన్ – 4186.431
6. యునైటెడ్ కింగ్‌డమ్ – 3839.18
7. ఫ్రాన్స్ – 3211.292
8. ఇటలీ – 2422.855
9. కెనడా – 2225.341
10.బ్రెజిల్ – 2125.958
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త శకం
ఐఎంఎఫ్ తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో గత 80 ఏళ్లుగా ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ క్రమం మారుతోందని హెచ్చరించింది. ఇది ప్రపంచాన్ని ఒక కొత్త శకంలోకి నడిపిస్తోందని పేర్కొంది.
భారత వృద్ధి అంచనాలో స్వల్ప తగ్గింపు
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) 2025 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.2 శాతానికి తగ్గించింది. అంతకుముందు జనవరిలో విడుదల చేసిన నివేదికలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయాల వల్ల పెరిగిన అనిశ్చితి కారణంగా ఈ వృద్ధి అంచనాల్లో స్వల్ప తగ్గింపు చోటు చేసుకుందని ఐఎంఎఫ్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ వినియోగం మద్దతుతో 2025లో భారతదేశ వృద్ధి 6.2 శాతంగా స్థిరంగా ఉంటుందని, అయితే పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితుల కారణంగా ఇది జనవరి అంచనా కంటే 0.3 శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.