India Corona: దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం కావడంతో ఎవరూ టెస్టులకు రాకపోవడంతో కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా మూడు లక్షల లోపు నమోదవుతున్న కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగొచ్చాయి. అయితే పాజిటివిటీ రేటు మాత్రం 14.5 శాతం నుంచి 15.77 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదివారం నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గడమే కారణం. కేసుల సంఖ్య తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. మరోపక్క మరణాలు 950 దాటాయి. ఆదివారం 13 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,09,918 మందికి పాజిటివ్ గా తేలింది. 24 గంటల వ్యవధిలో 959 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు రోజు ఆ సంఖ్య 893గా ఉంది.
ఒక కేరళలోనే 51 వేల కేసులు.. 475 మరణాలు సంభవించాయి. ప్రభుత్వం వెల్లడించే గణాంకాలపై కేరళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాష్ట్రం మునుపటి లెక్కలను కలపడంతో మృతుల సంఖ్య భారీగా ఉంది.
కర్ణాటకలో 68, మహారాష్ట్రలో 50 మంది మరణించారు. ఇప్పటివరకూ నాలుగు కోట్ల 13 లక్షల మందికి కరోనా సోకగా.. 4,95,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 2,62,628 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.89 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 18,31,268కి తగ్గాయి. క్రియాశీల రేటు 4.43 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 94.37 శాతానికి చేరింది. ఆదివారం సెలవు కావడంతో పరీక్షలు చేయించుకోవడానికి.. టీకాలు తీసుకోవడానికి ఎక్కువ మంది రాలేదు. దీంతో నమోదు తక్కువైంది.