Independence Day 2023: దేశంగా మనుగడ సాగించలేదని ఈసడింపులు.. ప్రజాస్వామిక దేశంగా ఉండలేదని సందేహాలు.. దేశానికి ఉండాల్సిన లక్షణాలే లేవన్న పాశ్చాత్యులు.. వాటన్నింటినీ తోసిరాజని అభివృద్ధి పథంలో.. మున్ముందుకు దూసుకుపోతున్న భారతదేశం.. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. ఒక దేశంగా ఆట్టే కాలం మనలేదు. ప్రజాస్వామిక దేశంగా అస్సలు బతికి బట్టకట్టలేదు.. అసలు ఒక దేశంగా ఉండే లక్షణాలేవీ భారతదేశానికి లేవు. ఒక భాష కాదు.. ఒక సంస్కృతి కాదు.. భాష, మాట, కట్టుబాట్లు, కులాలు, మతాలు.. ఇలా ఎన్నో వైవిధ్యాలు, వైరుధ్యాలున్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది?’’ ..1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు చాలా పాశ్చాత్య దేశాల ఆలోచన ఇది! ముఖ్యంగా బ్రిటన్‌కు చెందిన చర్చిల్ వంటి నేతలైతే శాపనార్థాలు కూడా పెట్టారు. కానీ.. ఆ భేదాలన్నింటినీ అధిగమించి భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఇదే ఈ ఏడున్నర దశాబ్దాల్లో భారత్ సాధించిన విజయం. ఈసడించినవారికి చెప్పిన గుణపాఠం. అంతే కాదు మూడో ఆర్థిక శక్తిగా అవతరిస్తూ ప్రపంచానికి చెబుతున్న స్ఫూర్తి పాఠం.
భిన్న సంస్కృతుల సమాహారం
ఉత్తరాది.. దక్షిణాది భేదాలు! హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, పార్శీ, సిక్కు మతాలు!! తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇలా లెక్కకు మిక్కిలిగా భాషలు! ఎవరి భాష వారిది! ఎవరి సంస్కృతి వారిది!! వేర్పాటువాదాలు.. రకరకాల భావజాలాలు.. సిద్ధాంత వైరుధ్యాలు.. ఇన్ని వైవిధ్యాలున్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా? ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా? అన్న సందేహాలు ఎవరికైనా వస్తే అది వారి తప్పు కాదు! అలాంటివారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం.. మన భారతదేశం. అసలు ఇలాంటి సందేహాలు రావడానికి ప్రధాన కారణం.. ప్రజాస్వామ్యం అనేది విదేశీ భావన. అప్పటికే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ విధానం విజయవంతం కావడానికి అవసరమైన నిర్ణీత పరిస్థితులు ఉండేవి. అంటే.. దేశ ప్రజలందరికీ ఒకటే భాష, ఒకటే సంస్కృతి, ఒకటే సంప్రదాయం, ఎక్కువ మంది ఒకే మతాన్ని అవలంబించేవారు కావడం. కానీ.. భారత్‌లో ఆ పరిస్థితులేవీ లేకపోవడంతో భారత్‌లో ప్రజాస్వామ్యం కొనసాగడం, దేశంగా మనగలగడం కష్టమని తొలినాళ్లలో అంతా భావించారు. మనకు స్వాతంత్య్రం వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు మనను పట్టించుకునేవి కావు సరికదా.. చిన్నచూపు చూసేవి. కానీ, ఆ పరిస్థితులను, అవమానాలను, చిన్నచూపును తట్టుకుని భారత్ నిలిచింది! 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ.. ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ఘనవిజయాలు సాధించి సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. వివిధ మతాలు, కులాలు ఎన్ని ఉన్నా కూడా.. నయానో, భయానో, బుజ్జగించో, సంప్రదింపులు జరిపో అందరినీ రాజ్యాంగం పరిధిలోని ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొచ్చి, పనిచేసేలా, చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన ఘనవిజయం. మన నిరసన తెలిపే, భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ మనకుంది. డెబ్బై ఐదేళ్ల క్రితం మన స్థూల జాతీయోత్పత్తి కేవలం రూ.2.7 లక్షల కోట్లు. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి అది 2.3 కోట్ల కోట్ల కాబోతోంది. భారతీయుల సగటు జీవితకాలం 27 ఏళ్లుగా ఉండే దశ నుంచి 77 ఏళ్లకు చేరింది! అక్షరాస్యత 16 శాతం నుంచి 75 శాతానికిపైగా పెరిగింది. దేశమంతటా విద్యుదీకరణ జరిగింది. ప్రపంచంలోని అతి తక్కువ అణుశక్తి గల దేశాల్లో భారత్ ఒకటి. ఎద్దుల బండ్లు నడుపుకొనేవారని ఎద్దేవా చేసిన పాశ్చాత్యుల దిమ్మ తిరిగేలా.. హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్‌తో భారతీయుల కలలను మోసుకుంటూ వెళ్లే మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతం చేసింది!
అన్నింటా ముందంజ
గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ తదితర విదేశీ కంపెనీలకు సీఈవోలను అందించింది!! ఆహార సమృద్ధిని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ముందంజలో నిలిచింది. ఇన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలున్న దేశంలో.. కూటమి ప్రభుత్వాలు సమర్థంగా నడవడం భారతీయులంతా కలిసి సాధించిన విజయమే. 1989 నుంచి 2014 దాకా 25 ఏళ్లపాటు మనదేశంలో కూటమి ప్రభుత్వాలు విజయవంతంగా నడవడమే ఇందుకు ఉదాహరణ. అలాగని అన్నీ విజయాలే కాకపోవచ్చు.. మనదేశాన్ని ఇప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు, సవాళ్లు పట్టి పీడిస్తుండొచ్చు! కానీ.. ఈ ఏడున్నర దశాబ్దాల్లో భారతదేశం సాధించిన విజయాలు చిన్నవి మాత్రం కావు. ప్రపంచమంతా తరచి చూసేంత పెద్దవి. అవును.. ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటికీ భారత్‌తో భాగస్వామ్యం కావాలి.. 140 కోట్ల పై చిలుకు జనాభాతో ఉన్న భారత మార్కెట్ కావాలి.. మన సహకారం కావాలి.. అనే పరిస్థితి ఉంది.
కరోనా కనువిప్పు కలిగించింది
వైద్యరంగానికి సంబంధించినంతవరకూ మనదేశంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని చాలా మంది భావించేవారు. అలాంటివారి భ్రమలన్నింటినీ.. కరోనా మహమ్మారి పటాపంచలు చేసింది. అత్యధికంగా వనరులున్న సంపన్నదేశాలతో పోల్చినా కూడా సమర్థంగా ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొంది. అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల మందికి విజయవంతంగా టీకాలు వేయగలిగింది. టీకాలపై వ్యతిరేకత కూడా సంపన్నదేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువే. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు దేశం మొత్తం ఎలా ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కోగలదో.. కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ ప్రపంచానికి చూపింది.
మధ్య తరగతి భారతం
ఈ ఏడున్నర దశాబ్దాల భారత ప్రస్థానంలో.. మనం సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించింది మధ్యతరగతే అనడం అతిశయోక్తి కాదు. అందుకే మనదేశ మధ్యతరగతి వర్గాన్ని.. ‘ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్’గా అభివర్ణిస్తారు. అలాగని మధ్యతరగతి వర్గంలో సమస్యలు లేవని కావు. కులం, మతం లాంటి భేదాలున్నా కూడా.. వాటన్నింటినీ తోసిరాజని మధ్యతరగతి తాను పురోగమిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తోంది. అంతేకాదు.. మనదేశంలో మధ్యతరగతివారి సంఖ్య 40 కోట్ల దాకా ఉంటుంది. ఇంత భారీస్థాయిలో.. అదీ వర్కింగ్ క్లాస్‌లో మధ్యతరగతివారు ఉండడం భారత్‌కు ఎంతో కలిసొచ్చిన అంశం. మేధో వలస ప్రారంభమై వివిధ దేశాలకు వెళ్లిన తొలితరం భారతీయుల్లో అత్యధికులు భారతీయులే. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కొలువైన దిగ్గజ టెక్ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న మన భారతీయుల్లో అత్యధికులు మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినవారే. ఇక.. దేశంలో కూడా ఉద్యోగ వర్గంలో మెజారిటీ మధ్యతరగతివారే. అదే భారత్ సాధిస్తున్న అనేక విజయాలకు ఒక ప్రధాన కారణం.
చైనాతో పోటీ పడాలి..
భారత్, పాకిస్థాన్ దేశాలు రెండింటీకీ స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లవుతున్న సందర్భంగా.. చాలా మంది భారత్‌ను ఆ దేశంతో పోల్చిచూస్తున్నారు. కానీ, పాకిస్థాన్ ఎప్పుడూ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా లేదు. సైనిక శక్తి పడగనీడలోనే ఉంది. మరోవైపున.. మావో నేతృత్వంలోని చైనా కూడా 1950ల్లో మనతోపాటే అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆర్థికంగా మనకన్నా చాలా ముందుకు వెళ్లిపోయింది. రాజకీయంగా చూస్తే చైనా కన్నా భారత్ చాలా మెరుగ్గానే ఉందిగానీ.. ఏకపార్టీ పాలన కారణంగా చైనా ఆర్థికంగా పెద్ద పెద్ద అంగలు వేయగలిగింది. కాబట్టి భారత్ ఇక ఆర్థికంగా, సాంకేతిక పరిజ్ఞాన పరంగా చైనాతో పోటీపడాల్సిన ఆసన్నమైందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Independence day 2023 many achievements of india in 76 years of reign
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com