Chandrababu: చంద్రబాబుకు అనూహ్యంగా తెలంగాణ నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయనది అక్రమ అరెస్టు అని.. కక్షపూరితంగా వ్యవహరించడం తగదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఖండిస్తుండడం విశేషం. అయితే అనూహ్యంగా బి.ఆర్.ఎస్ నుంచి సైతం చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు వస్తుండడం విశేషం. ఇప్పటికే తెలంగాణ బిజెపి చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ లు ఖండించారు. అటు కాంగ్రెస్ నాయకులు సైతం స్పందించారు. కానీ అధికార బి ఆర్ ఎస్ నాయకులు ఆ స్థాయిలో స్పందించలేదు.
ఆ మధ్యన ఎల్బీనగర్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం చంద్రబాబు అరెస్టును ఖండించారు. నిరసన కార్యక్రమాల్లోనూ సైతం పాల్గొన్నారు. అయితే ముందుగా స్పందించింది మాత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్. బాబు అరెస్టు అయిన కొద్దిసేపటికే జగన్ను అభినందించేలా ట్విట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. అటు తరువాత బి ఆర్ ఎస్ నేతలు స్పందించలేదు. హైదరాబాదులో ఐటి ఉద్యోగులు ఆందోళన చేసిన తర్వాత బి ఆర్ ఎస్ నేతల్లో చలనం వచ్చింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా కక్షలు పనిచేయని.. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అరెస్ట్ తీరు సరికాదు అంటూ తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకొచ్చారు.
మరో బి ఆర్ ఎస్ నేత, పూర్వపు తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు సైతం స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఏకంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి జగన్ పై విరుచుకుపడ్డారు. గత ఎన్నికలకు ముందు ఇదే ఘాట్లో చంద్రబాబుపై బండలు వేస్తూ.. జగన్కు అనుకూల ప్రకటనలు చేశారు మోత్కుపల్లి. జగన్ ను గెలిపించాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదే మోత్కుపల్లి చంద్రబాబును అరెస్టు చేసే తీరును చూసి తట్టుకోలేక పోయారు. అందుకే బహిరంగంగా బయటకు వచ్చి జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మొత్తానికైతే గతంలో చంద్రబాబును తిట్టిన వారంతా.. ఆయన అరెస్టును ఖండిస్తుండడం విశేషం. అది తెలంగాణ నుంచి.. ఒకప్పటి తన సహచరులే మద్దతుగా నిలుస్తుండడం గొప్ప విషయం.