YCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ జరగింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఏర్పాటుచేసిన ప్లీనరీ సక్సెస్ కావడంతో అధిష్టానం, ఇటు పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోంది. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా.. ప్రజా వ్యతిరేకత మాత్రం మూటగట్టుకుంది. అటు విపక్షాల ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతూ వస్తోంది. వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై మాత్రం అంత నమ్మకం లేకుండా పోయింది. అటు టీడీపీ, జనసేన కార్యక్రమాలకు జనాలు పెద్దఎత్తున తరలివస్తుండడం, గడిచిన ఎన్నికల్లో ఏకపక్షంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు దూరం కావడం వంటివి వైసీపీ నాయకత్వానికి కలవరపాటుకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్లీనరీ విజయవంతం అవుతుందా? లేదా? అన్న అనుమానం వెంటాడింది. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్లీనరీకి భారీగా జనాలు తరలిరావడంతో ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం. ఇప్పుడు అదే శ్రేణులకు టానిక్ లా పనిచేస్తోంది. అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది.
మూడేళ్లుగా అంతర్మథనం..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది పాలనలో లోపాలు అధిగమించేందుకే సరిపోయింది. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు వీలుపడలేదు. గత మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే అవకాశం లేకపోయింది. పైగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టడం లేదన్న అపవాదును సైతం మూటగట్టుకున్నారు. పార్టీ కేడర్ తో పాటు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఆ పార్టీ ప్రజాప్రతినిధులను సైతం కలవడం లేదన్న విమర్శలున్నాయి.
Also Read: Visakha Bike Racing: విశాఖ నగరంలో అర్ధరాత్రి కలకలం..అసలేం జరిగింది?
కేవలం సంక్షేమ పథకాల మీట నొక్కేందుకే ఉన్నారంటూ విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే వీటన్నింటికీ ప్లీనరీ వేదికగా జగన్ సమాధానం చెప్పినట్టయ్యింది. పార్టీ ఆవిర్భావం నుంచి తనను వెన్నుదన్నుగా నిలుస్తున్న వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోనని సైతం జగన్ గట్టి భరోసా కల్పించారు. రెండు రోజుల పాటు ప్రారంభ, ముగింపు ప్రసంగాల్లో అనుమానాలు, లోపాలను నివృత్తి చేశారు. అటు నేతలు కూడా తమలో ఉన్న అభద్రతా భావాలను, మనసులో ఉన్న అనుమానాలను కక్కేశారు. పార్టీయే అల్టిమేట్ అని చెప్పుకొచ్చారు. దీంతో శ్రేణుల్లో కూడా ఒక రకమైన అత్మస్థైర్యం పెరిగింది.ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో మునుపటి ధైర్యం కనిపిస్తోంది.
అభిప్రాయ సేకరణకు వేదిక..
అటు ప్లీనరీకి హాజరైన వారు, హాజరుకాకపోయిన వారు సైతం తమ ధీమాను కనబరుచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులన్నీ ఒకే వేదికపైకి రావడంతో అన్ని ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై ఒకరికొకరు అభిప్రాయాలను పంచుకున్నారు. మీ ప్రాంతంలో పార్టీకి కష్టమేనని వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజమని తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు. అదంతా ఉత్త ప్రచారమేనని.. పార్టీ బలోపేతంగా ఉందని చెబుతుండడంతో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోవైపు అధినేతతో పాటు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకుంటామని గంటాపధంగా చెబుతున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ప్లీనరీ సక్సెస్ కావడంతో తమ పార్టీకి 120 స్థానాలకు తక్కువ రావని ధీమాతో ఉన్నారు. విపక్ష కూటమి బట్టి స్థానాలు పెరిగే అవకాశముందని సైతం భావిస్తున్నారు. మరోవైపు ప్లీనరీసక్సెస్ పై పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి మీడియా నుంచి సైతం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్లీనరీకి ముందు తమలో ఏవేవో అనుమానాలుండేవని.. కానీ ప్లీనరీ తరువాత అనుమానాలు దూరమయ్యాయని మెజార్టీ కేడర్ చెబుతోంది. ఎన్నికల వరకూ ఈ దీమా ఉంటుందో? ఉండదో? చూడాలి మరీ.
Also Read:Vijayashanti- KCR: కేసీఆర్ కు విజయశాంతి అంటే ఎందుకు ప్రత్యేకమంటే