CM KCR: తెలంగాణలో ఎన్నికలు మరికొద్ది నెలలో జరగబోతున్నాయి. కానీ ఇప్పటికే ఈ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మిగతా పార్టీలు ఎలా ఉన్నప్పటికీ అధికార భారత రాష్ట్ర సమితిలో వాతావరణం ఒకింత హాట్ గా మారింది. గతంలో జరిగిన సమావేశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన తన నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు చాలామందికి ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు కొంతమంది ఎమ్మెల్యేల ముఖం కూడా చూసేందుకు కేసిఆర్ ఇష్టపడటం లేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వారు ప్రగతిభవన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇటీవల ఇటువంటి పరాభవాలు చాలామంది ఎమ్మెల్యేలకు ఎదురయ్యాయి. దీనిని బట్టి వారికి టిక్కెట్ దక్కడం అనేది ఇక కల్లే అని భారత రాష్ట్ర సమితి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా కొంతమంది మంత్రులకు కూడా ఈసారి టికెట్లు దక్కడం అనేది అనుమానమేనని తెలుస్తోంది.
ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్ వెంట పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సీఎం పక్కనే ఉండే ఆయన పట్ల అనూహ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆయన నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలిసింది. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు.. తాను కేసీఆర్‌కు సన్నిహితుడినని చెప్పుకొంటారు. ఆయన సీఎంకు, ప్రగతి భవన్‌కు దగ్గరేమో కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తన నియోజకవర్గంలోని ప్రజలకు మాత్రం చాలా దూరంగా ఉన్నారని మాత్రం తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసూళ్లకు పెట్టింది పేరని స్థానికంగా చాలా మందికి తెలుసు. తాజాగా బీఆర్‌ఎస్ చేయించిన సర్వేల్లోనూ ఎమ్మెల్యే వసూళ్ల పర్వం పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బయటపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాలో ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తి.. పలు సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించిన ఓ నేత.. తన నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు అధినేత గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలా గులాబీ బాస్ జరిపించిన సర్వేల్లో.. ఈ నలుగురైదుగురే కాదు… 30 మందికి పైగా అధికార పార్టీఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. ముఖ్య మంత్రి చేయించిన సర్వేల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు, దళిత బంధు లాంటి పథకంలో మామూళ్ల వసూళ్లు తెరపైకి రావడం విశేషం.
కొంతమంది నేరుగా ప్రగతి భవన్ కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి చేయించిన సర్వేల్లో దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తేలింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన 15 మందిలోనూ సగం మంది ఎమ్మెల్యేల పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలిచిన 88 స్థానాలకు తోడు, ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. తాజా సర్వేల ఆధారంగా చూస్తే ఈ 103 మందిలో ఇప్పుడు అనేకమందికి టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తోంది. వీరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇన్ని రోజులపాటు తనను నమ్ముకున్న వీరిని కాదంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? సిట్టింగ్ లను కాదని కొత్త వారికి టికెట్లు ఇస్తే వారికి ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఈ విషయాల మీద గులాబీ బాస్ మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ఫోన్లో సంప్రదిస్తే రెస్పాండ్ కాలేదని సమాచారం. ఇటీవల నిర్వహించిన పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఇన్ డైరెక్ట్ గా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని, సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వారంతా కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.