TDP Janasena Alliance తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. జగన్ను అధికార పీఠం నుంచి దించేందుకు పవన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 150 నియోజకవర్గాలకు పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అటు టిడిపి, ఇటు జనసేన వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు స్వీప్ చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. వైసిపి కనుచూపు మేర లో కూడా కనిపించదని సగర్వంగా చెబుతున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను గణాంకాలుగా చూపుతున్నారు. పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఈ తరహా ప్రచారం ఎక్కువైంది.
2014 ఎన్నికలను రిపీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. అప్పట్లో పవన్ టిడిపికి మద్దతు మాత్రమే తెలిపారు. ఆ ఎన్నికల్లో టిడిపి 102 స్థానాలను దక్కించుకుంది. కేవలం పవన్ మాటతోనే కాపులు, అభిమానులు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయానికి కారణమయ్యారు.అయితే 2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో రెండు పార్టీలకు ఓటమి ఎదురైంది. ముఖ్యంగా టిడిపికి అంతులేని నష్టం జరిగింది. ఒకవేళ గత ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంటే మరో 40 స్థానాలు సునాయాసంగా చేజిక్కించుకునే అవకాశం ఉండేది. తెలుగుదేశం పార్టీ 70 స్థానాలు వరకు.. జనసేన మరో 30 స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చి ఉండేవి. కానీ ఎవరికి వారు విడిగా పోటీ చేసి మూల్యం చెల్లించుకున్నారు.
2024 ఎన్నికల్లో ఆ పరిస్థితి రిపీట్ కాకూడదని చంద్రబాబు, పవన్ భావించారు. అందుకే కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. గత ఎన్నికల్లో ఫలితాలు వారికి గుణపాఠం నేర్పాయి. అందుకే కలిసి నడిస్తే కానీ.. వైసీపీని ఎదుర్కోలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ భావజాలం నుంచి వచ్చినదే వైసిపి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైసీపీకి మళ్ళింది. అటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బలం సైతం పొందగలిగింది. ఈ తరుణంలో మిగతా వర్గాలు టిడిపికి, జనసేనకు మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టిడిపి,జనసేన విడిగా పోటీ చేస్తే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అందుకే అటు చంద్రబాబు, ఇటు పవన్ లు పొత్తునకు ఎక్కువగా మొగ్గు చూపారు. పార్టీ ప్రయోజనాలు చూసుకుంటే.. మరోసారి దెబ్బ తినడం ఖాయమని ఈ స్థిరమైన నిర్ణయానికి వచ్చారు.
ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం విపరీతంగా వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం ద్వారా కోల్పోయిన స్థానాలు ఇవేనంటూ ఆ రెండు పార్టీలు సాధించిన ఓట్లను కలుపుతూ ఈ జాబితా ఉంది.దాదాపు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే విధంగా ఈ ఓట్ల గణాంకాలు ఉన్నాయి. అచంట, అమలాపురం, అనకాపల్లి,అవనిగడ్డ, భీమవరం,భీమిలి, ఎలమంచిలి, ఏలూరు, గాజువాక, గన్నవరం, కైకలూరు, కాకినాడ సిటీ,కాకినాడ రూరల్, కొత్తపేట, మచిలీపట్నం, మంగళగిరి, ముమ్మిడివరం, నగిరి, నరసాపురం, నెల్లూరు, సిటీ, నిడదవోలు, పెడన, పెనమలూరు, పిఠాపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, రామచంద్రపురం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తాడికొండ, తణుకు, తెనాలి, తిరుపతి, వేమూరు, విజయవాడ, సెంట్రల్, విజయవాడ ఈస్ట్,విజయవాడ వెస్ట్ తదితర 40 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం కారణంగా వైసిపి గెలుపొందగలిగింది. ఈ లెక్కల గణాంకాలు చూస్తున్న వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓటమి తప్పదని భావిస్తున్నాయి. ఈ 40 స్థానాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చాయి.