Karnataka Assembly Elections: కన్నడ యువత ఎటువైపో.. గెలుపోటములపై ‘తొలి ఓటు’ ప్రభావం!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. సుమారు 10 లక్షల వరకు ఉన్న కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 2, 2023 1:13 pm
Follow us on

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా సుమారు 10 లక్షల మంది కొత్తగా ఓటు వేయబోతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావింత చేసేస్థాయిలో నవ ఓటర్లు ఉన్నారు. దీంతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వీరిని తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే మే 10న జరిగే ఎన్నికల్లో ఈ కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ఫలితాలపై నవ ఓటర్ల ప్రభావం కచ్చితంగా ఉంటుందిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఓటర్లను ఆకర్షించేలా ప్లాన్‌..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. సుమారు 10 లక్షల వరకు ఉన్న కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. దీంతో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అధికార బీజేపీ అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌ మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తొలి ఓటు వేయనున్న 9.17 లక్షల మంది..
కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 9.17 లక్షలు. వీరంతా 2018–19 నుంచి కొత్తగా నమోదు చేసుకున్నవారు. సాధారణంగా వీరికి ఏ పార్టీతోనూ సంబంధం ఉండదు. కేవలం ప్రస్తుత సమస్యల ఆధారంగానే ఓటు వేస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో అన్ని వర్గాల మాదిరిగానే.. యువ ఓటర్లు ఎంతో కీలకమని చెబుతుంటారు. గత మూడు ఎన్నికల్లోనూ వీరి ప్రభావం స్పష్టంగా కనిపించిందని సర్వేలు పేర్కొన్నాయి.

బెంగళూరులోనే 1.35 లక్షల మంది
కర్ణాటక రాజధాని బెంగళూరులోనే సుమారు 1.35 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరందరి వయసు 20 ఏళ్లలోపేనని బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటుండటంతో రాజకీయ పార్టీలు వారినే టార్గెట్‌ చేస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రొఫైళ్లను తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో యువత కూడా కాలేజీ క్యాంటీన్లు మొదలు స్నేహితులు కలిసిన చోట రాజకీయాలపై చర్చ జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విద్య, ఉపాధిపైనే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ‘యువమాత’..
‘యువ మాత’ కార్యక్రమం ద్వారా యువత సమస్యలను ఎత్తిచూపుతున్న కర్ణాటక కాంగ్రెస్‌.. అన్ని జిల్లాల్లో యువత సమస్యలపై సర్వేలు నిర్వహించామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని హామీలు ఇస్తోంది. యువనిధి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ.3 వేల స్టైఫండ్‌ ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది.

బీజేపీ అభివృద్ధి అస్త్రం..
అధికార బీజేపీ కూడా యువ ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. యువజన విభాగంతో కలిసి ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమాలతో వారికి చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతోన్న అనేక పథకాలను యువతలో ప్రచారం చేస్తోంది. యువ సంవాద పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది.

యువ జనతాదళ్‌..
జేడీఎస్‌ యువజన విభాగమైన కర్ణాటక యువ జనతాదళ్‌ కూడా కొత్త ఓటర్లకు గాలం వేస్తోంది. మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బైక్‌ ర్యాలీలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగం, యువకులు, రైతుల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. జిల్లా స్థాయిలో యువతకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇలా కర్ణాటకలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఉన్న నవ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.