Imd Weather Predicted 2026: నేడు 2026 ఆంగ్ల సంవత్సరం మొదలైంది.. నిన్నటి నుంచే దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా యావత్ దేశం మొత్తం సంబరాలలో మునిగి తేలుతోంది. సాధారణంగా కొత్త సంవత్సరం రోజు ప్రజలు కొత్త కొత్త తీర్మానాలు చేసుకుంటారు. విద్య, వ్యాపారం, సంపాదన, ఖర్చు, సౌకర్యాల కల్పన.. ప్రతి విషయంలోనూ లెక్కలేసుకుంటారు.
మనుషులు బతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం కావాలి. ఇవన్నీ సమృద్ధిగా అందాలంటే కచ్చితంగా వాతావరణం సహకరించాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో వాతావరణం లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఉత్తర భారత దేశంలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అకాలమైన వర్షాలు.. విపరీతమైన ఎండలు.. వణికించే చలి గాలులు సర్వ సాధారణంగా మారిపోయాయి. దీనివల్ల విపరీతమైన నష్టం ఏర్పడుతోంది. జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
నేడు కొత్త సంవత్సరం సందర్భంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి అనుకుంటే.. ఈసారి ముందుగానే వాతావరణం షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మన దేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉత్తర ప్రదేశ్ లో జనవరి 1వ తేదీన వాతావరణం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లో జనవరి 2 నుంచి వాతావరణం ఊహించిన విధంగా మార్పులకు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా విపరీతంగా చలి, దట్టమైన మంచు ఉంది. అయితే రేపటి నుంచి ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందట. మంచు తొలగిపోయి.. చలి తగ్గిపోయి వర్షాలు కురుస్తాయట.
పశ్చిమ హిమాలయ ప్రాంతాలను ప్రభావితం చేసే చురుకైన గాలుల వల్ల ఇక్కడ వాతావరణంలో అస్థిరత ఏర్పడుతోందని వాతావరణంలో చెబుతున్నారు. దీనివల్ల ఉత్తర టెరాయ్, దక్షిణ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని.. మిగతా ప్రాంతాలలో వాతావరణం చలి, మంచు ఉంటుందని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త అతుల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ” ఈ కాలంలో చలి వుండాలి. మంచు కూడా కురుస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొద్దిరోజులుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి. ఇది ఒక రకమైన ఆందోళనకరమైన పరిణామం. ఎందుకంటే ప్రకృతి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అందువల్లే ఈ తీరుగా సంకేతాలు ఇస్తుందని” అతుల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.