YSRCP: వైసీపీలో ఇన్చార్జిల నియామకానికి కొలమానం ఏంటి? నియోజకవర్గంలో బలమైన నేతగా ఉండడమా? బాగా అభివృద్ధి చేయడమా? అంటే ముమ్మాటికీ కాదనే సమాధానం వినిపిస్తోంది. అధినేతపై వీర విధేయత చూపడం, ప్రత్యర్ధులపై బూతులతో విరుచుకు పడడమే అర్హతని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పెద్ద ఎత్తున వైసీపీలో అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. మమ్మల్ని ఎందుకు మార్చుతున్నారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. మీరు మా అంచనాలకు తగ్గట్టు పనిచేయలేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ లను తిట్టలేదు అంటూ జగన్ నుంచి సమాధానం వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు.. మార్పులు జరిగిన చోట బాధిత నేతలు ఇదే మాట చెబుతుండడం విశేషం.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విపరీత పోకడలు ప్రారంభమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులా చూడడం, పత్రికల్లో రాయలేని రీతిలో తిట్టించడం వైసీపీ నాయకత్వానికి ఒక అలవాటైన విద్యగా మారిపోయింది. ముఖ్యంగా పార్టీ అధినేత మనసు ఎరిగి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు తమ హోదాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు తాము శాసనసభలో ఉన్నామా? బహిరంగ సభలో మాట్లాడుతున్నామా? అన్నది చూసుకోకుండా విపక్ష నేతలను దారుణమైన బూతులతో తిట్టడం పరిపాటిగా మారింది. చంద్రబాబు, పవన్, లోకేష్ లను తిట్టాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తాయి. అందుకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్ల దండకం అందుకోవాల్సి ఉంటుంది. వారు ఏం మాట్లాడాలో? ఎవరిని తిట్టాలో కూడా సీఎం కార్యాలయమే చెబుతోంది. ఇందుకుగాను ప్రత్యేక డెస్క్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో టిక్కెట్ల రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి ఈసారి టిక్కెట్ లేదని అధినేత తేల్చేశారు. తనను ఎందుకు పక్కన పెట్టారని సదరు బాధిత నేత అధినేతను ప్రశ్నించారు. మీరు మా మనసును గెలుచుకోలేకపోయారు.. అందుకే పక్కన పెట్టానని అధినేత నిర్మోహమాటంగా చెప్పారు. నెల్లూరు జిల్లాలో మీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ మంత్రి నా మనసును గుర్తెరిగి నడుచుకున్నారని.. అందుకే జూనియర్ అయినా మంత్రి పదవిని ఇచ్చానని తేల్చి చెప్పడంతో సదరు నేత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీరు విపక్ష నేతలను తిట్టడంలో వెనుకబడిపోయారని.. మేము ఇచ్చిన టాస్క్ పూర్తి చేయలేకపోయారని చెప్పడంతో సదరు నేత షాక్ కు గురయ్యారు. తాను ఆ స్థాయికి దిగజారలేనని చెప్పిన సదరు నేత సీఎంవో నుంచి బయటకు వచ్చేసారు. ఆ పార్టీలో ఉండడం సరికాదని ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో టిడిపిలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.