Ponguleti Srinivasa Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఓ చర్చ బలంగా వినిపిస్తోంది. ఆయన ఇంటితో పాటు కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీతో పాటు ఈడి తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముంగిట జరిగిన ఈ తనిఖీలు రాజకీయ కోణంలో చేసినవని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీగా ఫండింగ్ చేస్తున్నట్లు పొంగులేటి పై ఆరోపణలు ఉన్నాయి. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన పొంగులేటి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఏపీలో కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారు. అక్కడ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేసి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ నుంచి ఇటీవలే ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మారారు.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ వైఖరి కూడా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సలహాతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం అస్మదీయులైన బడా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును వేగవంతం చేసింది. ఆ జాబితాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదంతా తెలంగాణ ఎన్నికల్లో ఫండింగ్ చేస్తున్నారని.. తెర వెనుక జగన్ పావులు కదుపుతున్నారని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏకంగా పొంగులేటిని టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల ముందు రేవంత్ ఇంట్లో పెట్టి మూడు రోజులపాటు ఇదేవిధంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసుకోవడం విశేషం.
అయితే ఏ ఉద్దేశ్యంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నా.. తెలుగు మీడియా మాత్రం అనుకున్న స్థాయిలో కవరేజ్ ఇవ్వకపోవడం విశేషం. అప్పట్లో రేవంత్ రెడ్డి విషయంలో టీవీ9, ఎన్టీవీ శృతి మించి మరీ ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు పొంగులేటి విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ తీగలాగితే.. తాడేపల్లి లో డొంక కదిలే అవకాశం ఉండడంతో ఆ రెండు మీడియా సంస్థలు జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్కు ఇబ్బంది రాకుండా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. పొంగులేటికి ఈ స్థాయిలో నగదు రావడం ఏపీ నుంచే నని అందరికీ తెలిసిందే. అందుకే కూలి మీడియా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్ నమ్మినబంటు కావడంతో.. అక్కడ సోదాల్లో ఏం దొరికినా.. అది జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉండడంతో టీవీ9, ఎన్టీవీలు ఎటువంటి సందేహాలను వ్యక్తం చేయలేకపోతున్నాయి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో అటు కేంద్రంలోని బిజెపి, ఇటు రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ ఇన్నాళ్లు ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమయ్యాయి. ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడు కావడమే కారణం. బిఆర్ఎస్ ను విభేదించి ఆయన కాంగ్రెస్లో చేరారు. మరోవైపు షర్మిల నేరుగా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఈ రెండింటి వెనుక జగన్ ఉన్నారన్నది.. అటు బి ఆర్ ఎస్, ఇటు బిజెపి అనుమానిస్తోంది. అందుకే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం ద్వారా.. జగన్కు గట్టి హెచ్చరిక పంపాలి అన్నది ఆ రెండు పార్టీల వ్యూహంగా తెలుస్తోంది. అయితే తెలంగాణతో మాకేంటి సంబంధం అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ లోలోపల మాత్రం వారికి బెంగ వెంటాడుతోంది.