Chandrababu- Eenadu: జర్నలిజం అనేది ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా ఉండేది. అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తేవాలి..వాచ్ డాగ్ లాగా తన పాత్ర పోషించాలి. అప్పుడే మీడియాకు విశ్వసనీయత ఉంటుంది. కానీ రోజురోజుకు మీడియాకు సొంత ప్రయోజనాలు ఎక్కువ కావడంతో జనం ఏవగించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ తెలుగు నాట మాత్రం ఈ ధోరణి తారాస్థాయికి చేరింది. తమకు నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే గొప్పవాడని, అతడు చేసే ఏ పనులైనా గొప్పవని, తమకు గిట్టని నాయకుడు అధికారంలో ఉంటే అతడు ఎందుకూ పనికిరాడని, అతడు చేసే పనులన్నీ వృధా అని తీర్మానించే స్థాయికి మీడియా ఎదిగిపోయింది. జనం ఏమనుకుంటున్నప్పటికీ.. వారి తీరుతో పని లేకుండా ఒక పక్షం వైపే మీడియా ఉండడం దురదృష్టకరం.
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసినప్పుడు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినప్పుడు.. అక్కడే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల ప్రజలకు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఇది ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది. దీనికి కారణం అప్పుడు చంద్రబాబు ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టడమే.. సరిగా ఇలాంటి విధానాన్ని స్థిరాస్తి వ్యాపారంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఆన్లైన్ అని చెప్పినప్పటికీ, ఆఫ్లైన్ విధానంలోనూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు తన మార్గదర్శి సంస్థల మీద జగన్ దాడి చేస్తున్న నేపథ్యంలో.. ఈనాడుకు ఈ ఆన్లైన్ విధానం తప్పుగా కనిపిస్తోంది. ఆఫ్లైన్లోనూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ బొక్కలు వెతికే ఈనాడుకు తప్పుగా అనిపించింది. ఇంకేముంది వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని రాసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ల కు సంబంధించి కేవలం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు సేకరిస్తుందని వివరించింది. అంతేకాదు ఆన్లైన్ విధానం ద్వారా దస్తావేజు లేఖరుల ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని ఒక కథనాన్ని అచ్చేసింది.
ఇదే ఈనాడు ఆన్లైన్ విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ ను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినప్పుడు అహో అంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఆన్లైన్ విధానం వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేసింది. అప్పుడు ఆన్లైన్ విధానం గొప్పగా ఉన్నప్పుడు.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానం కూడా గొప్పగానే ఉండాలి కదా.. కానీ ఇది ఈనాడుకు నచ్చడం లేదు. అందుకే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు అంటూ తన అక్కసును బయటపెట్టింది. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటూ రాసుకొచ్చింది. మరి ఇదే విధానాన్ని ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి ఉంటే ఈనాడు ఎలా ప్రతిస్పందించేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. మీడియా మీడియా తీరుగా ఉంటే బాగుంటుంది. పార్టీలకంటే ఎక్కువగా రంగులు పూసుకుంటేనే.. ఇదిగో ఇలాంటి వార్తలు ప్రచురించాల్సి వస్తుంది. జనం ఏవగించుకుంటున్నప్పటికీ ఈనాడు మారకపోవడం తెలుగు పాఠకులు చేసుకున్న దురదృష్టం.