Covid-19 Third Wave : థర్డ్ వేవ్ తప్పేలా లేదట.. ఎప్పుడొస్తుందటే?

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఖాయమని ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిక‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో చాలా మంది నిపుణులు, సంస్థ‌లు ఏకాభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. ఎప్ప‌టి నుంచి థ‌ర్డ్ వేవ్ ఊపందుకుంటుంది? ఎప్పుడు తార‌స్థాయికి చేరుతుంది? అన్న విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. చాలా వ‌ర‌కు సెప్టెంబ‌రులో మొద‌లుకొని అక్టోబ‌రు నాటికి ఉధృతి అందుకుంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఐసీఎంఆర్ వైద్యుడు డాక్ట‌ర్ స‌మిర‌న్ పాండా చేసిన వ్యాఖ్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఏయే ప్రాంతాల్లో థ‌ర్డ్ […]

Written By: Bhaskar, Updated On : August 31, 2021 4:16 pm
Follow us on

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఖాయమని ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిక‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో చాలా మంది నిపుణులు, సంస్థ‌లు ఏకాభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. ఎప్ప‌టి నుంచి థ‌ర్డ్ వేవ్ ఊపందుకుంటుంది? ఎప్పుడు తార‌స్థాయికి చేరుతుంది? అన్న విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. చాలా వ‌ర‌కు సెప్టెంబ‌రులో మొద‌లుకొని అక్టోబ‌రు నాటికి ఉధృతి అందుకుంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఐసీఎంఆర్ వైద్యుడు డాక్ట‌ర్ స‌మిర‌న్ పాండా చేసిన వ్యాఖ్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఏయే ప్రాంతాల్లో థ‌ర్డ్ వేవ్ విజృంభించే అవ‌కాశం ఉందో కూడా ఆయ‌న చెప్పారు.

దేశంలో సెకండ్ వేవ్ ఎంత‌టి ప్ర‌భావం చూపిందో తెలిసిందే. దేశం మొత్తం చిగురుటాకులా వ‌ణికిపోయింది. రోజుకు 4 ల‌క్ష‌ల పైచిలుకు కేసులు న‌మోదు కావ‌డం.. వేలాది మంది ప్రాణాలు కోల్పోవ‌డం చూసి.. ప్ర‌పంచం చ‌లించిపోయింది. ఇది చూసిన ప్ర‌జ‌లంతా.. థ‌ర్డ్ వేవ్ పేరు చెబితేనే భ‌య‌ప‌డిపోతున్నారు. రేప‌టి నుంచి సెప్టెంబ‌ర్ మాసం ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో.. దేశంలో కేసులు పెరుగుతున్న విధానంపై డాక్ట‌ర్ స‌మిర‌న్ పాండా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సెకండ్ వేవ్ తీవ్ర‌త ఎక్కువ‌గా లేని రాష్ట్రాల్లో ఇప్పుడు క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని డాక్ట‌ర్ స‌మిర‌న్ అన్నారు. ఇది థ‌ర్డ్ వేవ్ ప్రారంభాన్ని సూచిస్తోంద‌ని హెచ్చ‌రించారు. దీనికి ఆయ‌న విశ్లేష‌ణ కూడా చేశారు. సెకండ్ వేవ్ తొలినాళ్ల‌లోనే దేశంలోని చాలా రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయ‌ని చెప్పారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో నెల‌కొన్న ప‌రిస్థితుల ఆధారంగా దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌న్నారు. అందువ‌ల్ల ఆయా రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌న్నారు. అయితే.. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుండ‌డం థ‌ర్ద్ వేవ్ ముప్పును గుర్తు చేస్తోంద‌ని అన్నారు.

అందువ‌ల్ల ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎట్టి ప‌రిస్తితుల్లోనూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించొద్ద‌ని చెప్పారు. ముఖ్యంగా విద్యాసంస్థ‌ల ప్రారంభించ‌డంపైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థుల నుంచి త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు, సిబ్బంది, ఇలా.. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని సూచించారు.

థ‌ర్డ్ వేవ్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం నుంచి ఎస్‌బీఐ వ‌ర‌కు స‌ర్వేలు చేసిన నివేదిక‌లు ఇచ్చాయి. దాదాపు అన్ని నివేదిక‌లూ ఒకే విష‌యాన్ని చెప్పాయి. థ‌ర్డ్ వేవ్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అందులో పేర్కొన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ డాక్ట‌ర్ మ‌రోసారి ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. అయితే.. జాగ్ర‌త్త‌ల గురించి కూడా నొక్కి చెప్పారు. మాస్కు నుంచి వ్యాక్సిన్ వ‌ర‌కు అన్నీ తీసుకోవాల్సిందేన‌ని, నిబంధ‌న‌ల‌న్నీ ప‌క్కాగా పాటించ‌డాల‌ని, అప్పుడు మాత్ర‌మే థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించారు. మ‌రి, జ‌నం ఏ మేర‌కు ఈ నిబంధ‌న‌లు పాటిస్తార‌న్న‌ది చూడాలి.