CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలిచేస్తే పోలే అంటూ జగన్ తరచూ పార్టీ శ్రేణులకు హితోపదేశం చేస్తూ వచ్చారు. పరిస్థితి అంత సేఫ్ గా ఉందని చెప్పుకొచ్చిన జగన్ ను లోలోపల మాత్రం ప్రతికూల అంశాలు కలవరపెడుతున్నాయి. అందుకే తరచూ వర్కుషాపులంటూ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమవుతున్నారు. గత ఉగాది నుంచి వరుసగా మూడు వర్కుషాపులు నిర్వహించిన ఆయన.. డిసెంబరు 4న ముచ్చటగా నాలుగోసారి ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం కానున్నారు. అయితే ఈ వర్కుషాపులో పేరుకే ఎమ్మెల్యేల అభిప్రాయాలను కోరుతున్నారు. కానీ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, పైగా చేతిలో నివేదికలు పెట్టి డెడ్ లైన్ పెట్టడం ఎమ్మెల్యేలను కలవరపరస్తోంది. ఈ సారి సమావేశంలో అధినేత ఎటువంటి క్లాస్ తీసుకుంటారోనన్న ఆందోళన, బెంగ వారిని వెంటాడుతోంది.

సీఎం జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును మదిస్తున్నారు. ఇందుకు గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రమాణికంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని పదేపదే ఆయన హెచ్చరిస్తూ వచ్చారు కూడా. గడపగడపకూ ప్రభుత్వంలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను నిఘా వర్గాలు, ఐ ప్యాక్ బృందం సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, సంక్షేమ పథకాల అమలుతీరును తెలుసుకునేందుకు గడపగడపకూ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జగన్ నమ్మకంగా చెబుతూ వచ్చారు. కానీ అదే గడపగడపకూ కార్యక్రమం తమను రాజకీయంగా ఇబ్బందిపెడుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు తెగ బాధపడుతున్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి చిన్నపాటి ప్రశ్నలు ఎదురైనా నిలదీతల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి తప్పకుండా తమకు ఇబ్బంది తెచ్చి పెడతాయన్న బాధ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఉంది.
ప్రస్తుతం ఏపీలో ఐ ప్యాక్ టీమ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది. తాను బాగా పనిచేస్తున్నానంటూ తనకు తానే కితాబిచ్చుకుంటున్న జగన్ కు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నమ్మకం లేకుండా పోతోంది. అటువంటి వారిపై ఐ ప్యాక్ బృందాన్ని ప్రయోగిస్తున్నారు. వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇది వరకు జరిగిన వర్కుషాపుల్లో కొందరికి డెడ్ లైన్లు సైతం విధించారు. మీరు మారకుంటే మిమ్మల్ని మార్చడానికి కూడా వెనుకాడబోనని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ జాబితాలో కొందరు మంత్రులు సైతం ఉన్నారు. అయితే జగన్ దగ్గర పక్కా సమాచారం ఉందని.. ఎవరెవరు ఓడిపోతున్నారో ఆయనకు నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్నారని.. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సైతం గుర్తించారని వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ డిసెంబరు 4న జరిగే వర్కుషాప్ కొన్ని కీలక నిర్ణయాలకు వేదికగా మారనున్నట్టు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు చదివే అవకాశముందని కూడా టాక్ నడుస్తోంది. చివరిగా వారికి డెడ్ లైన్ విధించి.. అక్కడకు మారకుంటే మాత్రం మార్చేస్తానని జగన్ నేరుగా సంకేతాలు పంపే అవకాశముంది. కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు సమాచారమిచ్చారు. దీంతో ఈ మూడు వారాలైనా ప్రజల్లో ఉండి మంచి మార్కులు కొట్టేయ్యాలన్న ప్రయత్నంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తానికైతే డిసెంబరు 4 అంటేనే వారు హడలెత్తిపోతున్నారు.