Hydrogen Train India: ఇప్పటివరకు బొగ్గుతో నడిచే రైళ్లు, విద్యుత్ తో నడిచే రైళ్లను మనం చూసాం. చైనా, జపాన్ లాంటి ప్రాంతాలలో బుల్లెట్ రైళ్లను కూడా చూశాం. అయితే తొలిసారిగా మనదేశంలో హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. హర్యానా రాష్ట్రంలో ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టబోతోంది.
ఉత్తర రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఈ హైడ్రోజన్ రైలు రూపొందించారు. ఈ రైలు జింద్ – సోనిపాట్ మధ్య పరుగులు పెట్టబోతోంది. అయితే ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్ ప్రాంతంలో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం దాదాపు 3,000 కిలో గ్రాములు. 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్ కు అనుసంధానం చేశారు. ఫలితంగా ఈ రైలు నిరంతరాయంగా పరుగులు పెడుతుంది. అంతేకాదు, ఇంధనం కూడా సమకూరుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును సమీక్షించడానికి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్, దక్షిణ హర్యానా బిజిలీ వితరణ నిగం కు చెందిన అధికారులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైడ్రోజన్ రైలుకు సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిని ప్రారంభిస్తారని తెలుస్తోంది.
విద్యుత్ తో నడిచే రైళ్ల వల్ల రైల్వే శాఖ మీద భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రోజన్ తో నడిచే రైళ్లను రైల్వే శాఖ ప్రవేశ పెట్టబోతోంది. ఈ విధానం కనుక విజయవంతం అయితే.. భవిష్యత్ కాలంలో హైడ్రోజన్ తో నడిచే రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రధానమైన మార్గాలలో ఈ రైళ్ల ను రైల్వే శాఖ ప్రవేశపెడుతుంది. వీటివల్ల నిర్వహణ భారం తగ్గుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఫలితంగా విద్యుత్ వ్యవస్థల మీద ఒత్తిడి కూడా తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది. హైడ్రోజన్ ద్వారా నడిచే రైళ్లు వేగంగా పరుగులు పెడతాయని.. పర్యావరణహితమైన విధానంలో వీటి నిర్వహణ ఉంటుందని రైల్వే శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు పరిమితంగానే వ్యయమైందని రైల్వే శాఖ చెబుతోంది.