Rajasingh Granted Bail : ఒక మత ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట దక్కింది. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ ను ఈ ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మొదట నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్ తరుఫు లాయర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే బెయిల్ పిటీషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. 41సీపీఆర్సీ పాటించకుండా ఎలా రిమాండ్ చేస్తారని న్యాయవాది కోరారు. పోలీసుల తరుఫు న్యాయవాది పాత కేసులను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసి ఊరట కల్పించింది. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.
రాజాసింగ్ బెయిల్ పై వాదనల సందర్భంగా కోర్టు ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు పోటీపోటా నినాదాలతో అక్కడ పరిస్థితులు చేయిదాటాయి. పరస్పరం వాగ్వాదానికి దిగారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తర్వాత గత రాత్రి హైదరాబాద్ లో నిరసనలు చెలరేగాయి. బషీర్ బాగ్ లోని సీపీ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళన కారులు నిరసన తెలిపారు. నగరంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ కేంద్ర శిక్షణ సంఘం సస్పెండ్ చేసింది. పార్టీ రాజ్యాంగానికి ఉల్లంఘన పాల్పడ్డట్టు పేర్కొన్న కమిటీ.. పది రోజులపాటు వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని సూచించిన కేంద్ర కమిటీ. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని సూచించింది.