Huzurabad by poll nominations: హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగియనుంది. రాష్ర్ట రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఉప ఎన్నికలో పలు విషయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. అక్టోబర్ 1 నుంచి 8 వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉండడంతో గురువారం వరకు 15 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రంతో నామినేషన్ల దాఖలుకు తెరపడనుండటంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 13న ఉంటుంది.

అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు,. దీంతో పార్టీల్లో ప్రచారం ముమ్మరం అయిపోయింది. విజయం కోసం అన్ని పార్టీలు తమ శక్తియుక్తుల్ని పెడుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీలో ఉండగా పలువురు ఇక్కడ నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం చివరి రోజు కావడంతో ఈటల, వెంకట్ నామినేషన్లు వేయనున్నారు.
ప్రభుత్వంపై ఆగ్రహంతో క్షేత్రసహాయకులు కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు శుక్రవారం దాఖలు చేసే అవకాశం ఉంది. పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలో ప్రచారంలో మరింత దూకుడు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో హుజురాబాద్ లో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.
అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నందున అది బీజేపీకి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. దీంతో విజయం బీజేపీకి దక్కుతుతందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి దీమాకు వారికి ఉన్నాయి. ఏదిఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికలో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి.