Huzurabad by Elections: హతవిధీ.. ఏమిటీది..? తెలంగాణలో అప్రతిహతంగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనను ఎదురించినందుకు..కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎలుగెత్తి చాటినందుకు మంత్రి పదవిని పోగొట్టుకున్నాడు ఈటల రాజేందర్. అంతటితో ఈటలను వదల్లేదు. ఆయనపై అసైన్డ్ భూముల కేసులు పెట్టి ఇరికించేశారు. ఆ తర్వాత ఈటల రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇప్పుడు అంతే ధీటుగా టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు.

కానీ తమను ఎదురించిన ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి కరిపించాలని టీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. అందుకే హుజూరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు ‘పేరు రాజకీయం’ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ చేసిన ఈ హఠాత్ వ్యూహానికి ఏం చేయాలో తెలియక అటు ఈటల, ఇటు బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.
హుజూరాబాద్ బరిలో ఇప్పుడు ఈటల రాజేందర్ తోపాటు మరో ముగ్గురు రాజేందర్ లు బరిలో నిలవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న వారిని రాష్ట్రవ్యాప్తంగా వెతికి తెచ్చి మరీ హుజూరాబాద్ బరిలో నిలిపారు. అదే ఇప్పుడు ఈటల, బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈటలను దెబ్బతీసేందుకే అదే పేరుతో ఉన్న వారిని తీసుకొచ్చి టీఆర్ఎస్ నామినేషన్లు వేయించిందని.. ఓడించేందుకు కుట్ర పన్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
బీజేపీ నుంచి పోటికి దిగిన ఈటల రాజేందర్ గుర్తు ‘కమలం పువ్వు’ చూసి ఓటేస్తే సేఫ్ అవుతాడు. ఒకవేళ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి రాజేందర్ పేరును చూసి గుద్దారో.. ఈటల పని ఖతమవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన ఈ ‘పేర్ల రాజకీయం’లో ఈటలకు ఎంత దెబ్బ పడుతుందనేది వేచిచూడాలి.