AP Roads Accident : ఏపీలో ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్టు ఉంది పరిస్థితి. గోతుల్లో రహదారులు వెతుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కనీసం అత్యవసర సమయాల్లో 108, 104 వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో రహదారులు ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న అన్యాయం. అటు వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెబుతున్నా.. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు అందని దుస్థితి. పేరుకే 24 గంటల ఆసుపత్రులు కానీ.. సాయంత్రం ఐదు గంటలు దాటితే వైద్యం అందని ధైన్యం. భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. మూడు గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆ భర్తకు ప్రయాసలే మిగిలాయి. చివరకు భార్య ప్రసవించిన ఆసుపత్రిలోనే అతను కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు జిల్లా కారంపూడి కి చెందిన రామాంజని అనే మహిళ 8 నెలల నిండు గర్భిణీ. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ఎటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో.. వెనువెంటనే గురజాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ సైతం సదుపాయాలు అంతంత మాత్రమే. దీంతో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాడైన రహదారులతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. చివరకు అతి కష్టం మీద నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగలిగారు. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇంటిల్లపాది సరదా పడ్డారు.
అయితే వారి సరదా ఎంతసేపు నిలవలేదు. అత్యవసర సమయం వేళ భర్త ఆనంద్ డబ్బులు తీసుకురాలేదు. ప్రైవేటు వైద్యం అవసరమని భావించి.. గురజాల వరకు గర్భిణీకి తోడుగా వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తుండగా జోలకళ్ళు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు గుంతల్లోబోల్తా పడింది.దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.గుర్తించిన స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆనంద్ కన్నుమూశాడు.అప్పడే పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏపీలో రోడ్ల దుస్థితిని చాటింది. ఇది ఒక ఆనంద్ పరిస్థితి కాదని.. ఏపీలోనే అన్ని ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి ఇలానే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆనంద్ మృతికి ముమ్మాటికి జగన్ సర్కార్ వైఖరి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదిగో.. ఇదిగో అంటూ నాలుగున్నర ఏళ్ళు పాటు కాలం గడిపారని.. ఒక్క రహదారిని కూడా నిర్మించలేకపోయారని జగన్ సర్కార్ పై ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి. అటు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వానికి.. ఈ ఘటనతోనైనా కనువిప్పు కలగాలని సామాజిక మాధ్యమాల్లో నేటిజెన్లు కోరుతున్నారు. ఇప్పటికైనా రహదారులను బాగు చేయాలని… ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.