
కరోనా కల్లోలంలో ఇప్పుడు మనల్ని కాపాడేది కేవలం వ్యాక్సిన్లు మాత్రమే. కరోనా కు మందులు లేవు. వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు భారీ స్పందన వచ్చింది.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో మొత్తం 30 హాళ్లలో ఏర్పాటు చేసిన 300 టేబుళ్ల వద్ద టీకాలు వేస్తున్నారు. తొలి గంటలో ఏకంగా 5వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దేశంలోనే ఇది అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కావడం విశేషం. ఒకే చోట 40వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్ దేశంలోనే మొదటిసారి అట.. ఇందుకు హైటెక్స్ ఎగ్జి బిషన్ కేంద్రం వేదిక అయ్యింది.
ప్రైవేటు వ్యాక్సినేషన్ అయినా కూడా దీన్ని తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆస్పత్రులు ఈ డ్రైవ్ నిర్వహించాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరిగే ఈ డ్రైవ్ లో సుమారు 5వేలకు పైగా ఐటీ ఉద్యోగులు, గేటెడ్ కమ్యూనిటీలు పాల్గొనే అవకాశం ఉంది.
ముందుగా మెడికవర్ ఆస్పత్రుల అధికారిక వెబ్ సైట్ ద్వారా పేరు నమోదు చేసుకున్న వారికే ఈ టీకా పొందేందుకు అవకాశం కల్పించారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లలో వందలమంది నివసించే ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులు ఈ టీకా డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి.
కరోనా టీకాకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎక్కువమంది ఈ టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నగర వ్యాప్తంగా ఆరోగ్యకేంద్రాల్లో సూపర్ స్ప్రైడర్లుగా గుర్తించిన వారికి టీకాలు వేయిస్తోంది. మాదాపూర్ హైటెక్స్ లో నడుస్తున్న ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు భారీగా ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 40వేల మంది ఈ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు రావడంతో రద్దీ ఏర్పడింది.