Munugode Bypoll: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించారు. స్పీకర్ ఆమోదించారు. ఇక ఉప ఎన్నిక తరువాయి. కానీ ఎప్పుడు నిర్వహించేది తేలలేదు. మరో 16 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తుండడంతో సెమీ ఫైనల్ లాంటి ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగిన టిఆర్ఎస్ తరఫున ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగేవారు. కానీ దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చరిష్మా తగ్గింది. దీంతో ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తీసుకొస్తున్నారు. ఇవన్నీ తెర పైన కనిపించేవే. మరి తెర వెనుక ఏం జరుగుతోంది? హుజురాబాద్ ను మించి మునుగోడు లో ఖర్చు ఉండబోతోందా? ప్రజా ప్రతినిధులకు పార్టీలు ఏ మేరకు తాయిలాలు ప్రకటిస్తున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే మరీ.. అంతలా ఖర్చు అక్కడ ఇప్పుడే ఏరులై పారుతోందట..

రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యం కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనెల 20న సీఎం కేసీఆర్ సభ, 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ, 16 నుంచి మండలాల వారీగా కాంగ్రెస్ సమావేశాల షెడ్యూల్ ఖరారు కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రధాన పార్టీల నేతలు అంతా మునుగోడు బాట పట్టారు. సీఎం సభ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో మండల స్థాయి సమావేశాలు పూర్తిచేసుకుని, గ్రామస్థాయిలోకి వెళ్తున్నారు. అయితే ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు భారీగా లేకపోవడంపై సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సారథ్యంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పడం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారందరికీ కూడా భారీ ప్యాకేజీలు ముట్ట చెప్తున్నట్టు సమాచారం. అయితే టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నుంచే భారీగా చేరికలు ఉంటాయని భావించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు నుంచే ఒక వ్యూహంతో పని చేస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ నాయకులను తన చేయి దాటకుండా చూసుకున్నారు. సర్పంచ్ కు, ఎంపీటీసీకి వారి వారి స్థాయి ఆధారంగా రెండు నుంచి ఐదు లక్షల వరకు రాజగోపాల్ రెడ్డి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నాయకుల దరిద్రం అంతా పోయి..అప్పులన్నీ క్లియర్ అవుతున్నాయట.. దీనివల్లే అధికార టీఆర్ఎస్ లో ఆశించినంత స్థాయిలో చేరికలు జరగడం లేదని తెలుస్తోంది.
ఏర్పాట్లలో నువ్వా నేనా
ఇక ఉప ఎన్నికల్లో పోటీ తీవ్రతను అంచనా వేస్తున్న టిఆర్ఎస్, బిజెపి నేతలు ముందస్తు ఏర్పాట్లలోనూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు చౌటుప్పల్ మండల కేంద్రంలో ఐదు లాడ్జిలు ఉండగా.. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ వరకు మూడు లాడ్జిలను నియోజకవర్గానికి చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు ముందస్తుగా బుక్ చేసుకున్నారు. మరోవైపు మండల కేంద్రాల్లోని ఇళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతున్నది. జాతీయ రహదారి పక్కన ఉండటం నియోజకవర్గం లోని మిగిలిన మండలాలకు రాకపోకలకు అనువుగా ఉండటంతో చౌటుప్పల్ మున్సిపాలిటీలో పెద్దపెద్ద ఇళ్లను జిల్లా నాయకుల ముందస్తుగా బుక్ చేసుకొని అద్దెలు చెల్లిస్తున్నారట.. ఎంత అద్దె అయినా పర్వాలేదు అంటూ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నిక ఇంచార్జి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరులు రెండు రోజులుగా ఇళ్ల కోసం వేట మొదలుపెట్టారు. మునుగోడు మండల కేంద్రంలోని చండూరు రోడ్డులో నాయకుల బస కోసం రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఇప్పటికే ఇళ్లను డిసెంబర్ వరకు బుక్ చేసుకున్నారు. ఉప ఎన్నిక ఫలితంగా వంద గజాల షట్టర్ షాపు అద్దె గతంలో 10,000 ఉండగా.. ఇప్పుడు 15,000 కు చేరింది.

ఖర్చు అంతకు మించి
ఇక ఈనెల 20న కేసీఆర్ సభకు 20 ఎకరాలు, 21న అమిత్ షా సభ నేపథ్యంలో 30 ఎకరాలను ఆయా పార్టీల నేతలు సేకరించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. ప్రధాన పార్టీల నేతల సమావేశాల నేపథ్యంలో ఆ పంటలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో రైతుల నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండేందుకు ఎకరాకు ₹60,000 చెల్లించేలా రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ముందస్తు చెల్లింపుల్లో భాగంగా ఎకరాకు పదివేల చొప్పున రైతులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక టిఆర్ఎస్ నేతలు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. సీఎం సభ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార రథాలు 13 నుంచే నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నాయి.
మరోవైపు ప్రధాన పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా యువకులను నియమించుకొని, వారికి సెల్ ఫోన్లు, అపరిమిత డేటా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా సైన్యంలో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా ఉన్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా పలు గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేస్తుండటం ఘర్షణ వాతావరణానికి తావిస్తోంది. ఇది ముమ్మాటికి టిఆర్ఎస్ కార్యకర్తల పని అంటూ బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఉపఎన్నిక తేదీ ఖరారు కాకపోయినప్పటికీ ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం సాగిస్తుండటం వల్ల ఎన్నికల ఖర్చులో మునుగోడు మరో హుజురాబాద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంతకుమించి కూడా ఖర్చు ఇక్కడ అయ్యేలా ఉందంటున్నారు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సడెన్ ప్లాన్ ఛేంజ్.. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఆ వ్యూహం
[…] Also Read: Munugode Bypoll: భారీ ప్యాకేజీల మునుగోడు […]
[…] Also Read: Munugode Bypoll: భారీ ప్యాకేజీల మునుగోడు […]