Nidhhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్ పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ కి టాలెంట్ ముఖ్యం కాదు, అంతకు మించి అందం కావాలి అన్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలెంట్ చూసి ఆఫర్స్ ఇచ్చేవారు పరిశ్రమలో లేరు. హీరోయిన్ అందంగా ఉందా లేదా అన్నదే చూస్తారు. అలాంటి అమ్మాయిలకే ఆఫర్స్ ఇస్తారు. రానున్న రోజుల్లో హీరోయిన్స్ పని గ్లామర్ షో చేయడమే. ప్రేక్షకులు కూడా దాని కోసమే థియేటర్స్ కి వస్తున్నారు.

అందుకే నేను గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమయ్యాను. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్ వస్తే రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా చేస్తాను. నాకు ఇంత కావాలని డిమాండ్ చేయను. ఎందుకంటే స్టార్ హీరోతో సినిమా చేస్తే తర్వాత అవకాశాలు వస్తాయని నాకు తెలుసు. కాబట్టి స్టార్ హీరోతో అవకాశం వస్తే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి, గ్లామర్ షో చేయడానికి వెనుకాడనని నిధి అగర్వాల్ హింట్ ఇచ్చేసింది.
నిజం చెప్పాలంటే పరిశ్రమలో ఉన్నది అదే. ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయిలకే డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్ దర్శక నిర్మాతలు కోట్లు కుమ్మరించి నార్త్ నుండి హీరోయిన్స్ ని దిగుమతి చేసుకుంటారు. టాలెంట్ తో రాణించిన సాయి పల్లవి లాంటి స్టార్స్ చాలా అరుదుగా ఎక్కడో ఒకరు ఉంటారు. నిధి సూపర్ గ్లామరస్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దానికి కారణం ఆమెకు సక్సెస్ రేటు లేకపోవడమే.

నిధి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే సూపర్ హిట్ గా ఉంది. తెలుగులో నిధి నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను, హీరో నిరాశపరిచాయి. అనూహ్యంగా ఆమెకు హరి హర వీరమల్లు చిత్ర ఆఫర్ దక్కింది. పవర్ స్టార్ పక్కన ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అందులోనూ భారీ పాన్ ఇండియా చిత్రం. ప్రస్తుతం నిధి ఆశలన్నీ హరి హర వీరమల్లు చిత్రం పైనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతుంది. హరి హర వీరమల్లు విజయం సాధిస్తే నిధికి బ్రేక్ వచ్చినట్లే.