
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవర్ స్టార్ గా పవన్ కల్యాణ్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన పాపులారిటీ సినిమాపరంగా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. పవన్ కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్వాలేదు అనే రీతిలో ఆయన ఫ్యాన్స్ కలెక్షన్లు కురిపిస్తూ ఉంటారు.
అయితే రాజకీయపరంగా మాత్రం పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించలేకపోతున్నారు. 2014లో ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నాడు ఆ ఎన్నికల్లో పోటీ దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో పవన్ సపోర్టు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత టీడీపీకి జనసేనకు మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీకి దూరంగా జరిగాయి. 2019 ఎన్నికల్లో చిన్నచితక పార్టీలతో కలిసి జనసేన పోటీచేసింది. ఈ ఎన్నికల్లో జనసేన ఒకే ఒక సీటు గెలుచుకొంది. ఆ ఎమ్మెల్యే కూడా జనసేనతో పెద్దగా కలువడం లేదు. ఈ ఎన్నికల్లో ఘోరా పరాజయం తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ తర్వాత కరోనా బారిన పడ్డారు. ఈ ఎన్నికల్లో ఈ కూటమి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. నాటి నుంచి జనసేనాని సైలంటైపోయారు. అంతకముందు పార్టీ సభ్యత్వాలు అంటూ జనసేన నేతలు హడావుడి చేశారు. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా నిస్తేజంగా ఉన్నారు.
దీనికితోడు పవన్ కల్యాణ్ పలు సినిమాలతో బీజీగా ఉన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ రిలీజై సంచలన విజయం సాధించింది. కరోనా కారణంగా వాయిదాపడిన పలు సినిమాలు మళ్లీ పట్టాలెక్కబోతున్నారు. త్వరలోనే ‘అయ్యప్పకుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమా మొదలైంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయంగా యాక్టివ్ కన్పించడం లేదు. సోషల్ మీడియాలో అరకొర ట్వీట్లతో సరిపెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా సినిమాలపై ఉన్నట్లు కన్పిస్తుంది. దీంతో జనసైనికులు పార్టీ భవిష్యత్ పై అయోమయం చెందుతున్నారు.
త్వరలోనే ఏపీలో కొన్నిచోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు మాత్రం జనసేనకు అనుకూలంగా కన్పించడం లేదు. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ ఉప ఎన్నికలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ జనసేనాని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ విన్పిస్తుంది. దీంతో జనసేనాని పార్టీని ఎలా ముందుకు తీసుకెళుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.