రోజులు గడుస్తున్నాయి భారంగా , ఇంట్లో బందీలం , బలవంతంగా టీవీ ప్రేక్షకులం. అయినా క్షేమం , కరోనా మహమ్మారి విముక్తులం. ఇంటి లక్ష్మణ రేఖ దాటితే కాచుకుకూర్చుంది కరోనా భూతం, అందుకే ఇల్లు వదలం , కరోనాను దరిచేరనివ్వం. ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్ పాటిస్తాం, మానవాళి ని కాపాడుకుంటాం. ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదే మనదే. ఇదే మన లక్ష్యం , ఇదే మన గమ్యం.
ఈ లక్ష్యంతో హాయిగా ఆనందంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో గడుపుదాం. ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నాళ్ళనుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి పాతరోజులు గుర్తుకుతెచ్చుకుంటే వేసవికాలం వచ్చిందంటే చాలు అందరం ఊళ్లకు చేరి కాలక్షేపం చేసేవాళ్ళం. ఆరోజులే వేరు. మరి ఇన్నాళ్ళకు అటువంటి అవకాశం మళ్ళా వచ్చింది. ఈ మధ్యలో పరుగుల యుగంలోకి ప్రవేశించి పాత జీవితం మరిచిపోయామని కాబోలు ఈ మహమ్మారి మనల్ని పాత జ్ఞాపకాల దొంతరలోకి నెట్టింది. అప్పటికీ ఇప్పటికీ తేడా అప్పుడు పుస్తకాలు , కబుర్లు, ఆటల్లో మునిగిపోతే ఇప్పుడేమో స్మార్ట్ ఫోను, స్మార్ట్ టీవీ , లాప్ టాప్ లతో క్షణం తీరికలేకుండా గడుపుతున్నాం. ఇంట్లోవున్నా ఇవి అందుబాటులో ఉండటంతో టైం ఇట్టే గడిచిపోతున్నట్లుంది కదూ.
కొంతమందికి ఇంట్లో వుండటం ఇబ్బందే
అయినా ఇంట్లో వుండమంటే ఇబ్బందిపడే జనానికి తక్కువేమీ లేదు. తిరిగే కాలు తిట్టే నోరు కట్టిపడేస్తే ఇబ్బందే మరి. కొంతమందికి మంది మార్బలం లేకపోతే నిద్రపట్టదు. ప్రత్యర్ధి పార్టీ వాళ్ళను తిట్టందే నోటి దురద తీరదు. ఏం చేద్దాం ఎవరి అలవాట్లు వారివి. ఇంట్లో కట్టిపడేసే సరికి ఏమిచేయాలో తెలియక కస్సు బస్సు లాడటం మొదలయ్యిందంట. ఇంట్లో కబుర్లు చెప్పమంటే కసురుకోవటం , ప్రతర్దులమీద చూపించే కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపించటం జరుగుతుందంట. దీనికి ఇంటి ఆడపడుచులందరూ కలిసికట్టుగా ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నారంట. లేకపోతే మధ్యాహ్నం సీరియళ్ళు మిస్ అవుతున్నారంట. అందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రానే వచ్చింది సువర్ణవకాశం. మొన్నటికి మొన్న మోడీ వీడియో రిలీజ్ చేసాడు. ఈసారి అరగంట కాకుండా పది నిముషాలలోనే ముగించాడు. అందుకనే ముందు రోజు రేపు చిన్న వీడియో రిలీజ్ చేస్తానని ముందుగానే చెప్పాడు. వెంటనే మీడియా లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. మోడీ ఏమి మాట్లాడబోతున్నాడో ననే ఊహాగానాలు , డిబేట్లు షరా మామూలే. ఆ టైం రానే వచ్చింది. క్లుప్తంగా తను చెప్పాల్సింది సూటిగా చెప్పాడు. లాక్ డౌన్ ఇప్పటిదాకా సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సామాజిక దూరాన్ని వచ్చే పది రోజుల్లో కూడా తప్పకుండా పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చాడు. చివరగా ఆదివారం 9 గంటలకు 9 నిముషాలు లైట్లు ఆపి దీపం వెలిగించమని విజ్ఞప్తి చేసాడు. ఇక మీడియా ఎప్పటిలాగే డిబేట్లే డిబేట్లు. కాకపోతే ఎక్కువగా మానసిక శాస్త్రవేతల్ని పిలిచి దీనిపై చర్చించటం బాగానే వుంది.
సామాజిక మాధ్యమాలు, మేధావులు
మోడీ ఇచ్చిన పిలుపు స్పష్టంగా వుంది. ఎందుకు ఈపని చేయాలో చెప్పాడు. ఇంట్లో ఒక్కరిగా వున్నా మీకు 130 కోట్ల ప్రజానీకం తోడున్నారని ఆత్మవిశ్వాసం పెంపొందించటానికి అందరం కలిసి ఈ కార్యక్రమం చెప్పట్టాలని చెబితే వెంటనే సామాజిక మీడియా లో దీనికి వున్న సంఖ్యా శాస్త్ర ప్రాధాన్యతని ఏకరువు పెడుతూ పుంఖాను పుంఖాల పోస్టులు వెలువడ్డాయి( ఏదో ఆయన వీళ్ళ చెవిలో చెప్పినట్లే) . కొంతమంది దీని రాశి బల ప్రాముఖ్యాన్ని వివరించారు. కొన్ని తెలుగు ఛానళ్ళయితే అదేపనిగా పనిగట్టుకొని ఈ ప్రచారం చేసారంట. ఇంకేముంది హేతువాదులూ , వామపక్ష మేధావులూ మోడీ ఈ దేశానికి ప్రదానమంత్రా లేక మూఢ నమ్మకాలకి ప్రతినిధా అని ఎద్దేవా చేస్తూ పోస్టింగులు పెట్టారు. అసలు సమస్య పక్కదోవపట్టింది. ప్రజలు 21 రోజులు ఇంట్లోనే గడపాలంటే మధ్య మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే పట్టు సడలిపోయే అవకాశం వుంటుందనేది ఏమాత్రం బుర్ర పెట్టి ఆలోచించే వాళ్లకు అర్ధమవుతుంది. ముఖ్యంగా వామపక్ష మేధావులకు ఈ విషయం లో పూర్తి అవగాహన వుంది. ఎందుకంటే దీర్ఘకాలిక సమ్మెలు చేసిన అనుభవముంది కదా. ఒక్కసారి పిలుపు నిచ్చి వూరుకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలిసికూడా దీనిపై యాగి చేయటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా.దీనిపై సానుకూల దృక్పధం తో ఆలోచిస్తే విషయం అర్ధమయ్యి అందరిలో ఐక్యత పెరుగుతుంది. అంతేగాని గ్రహబలాలు, ,సంఖ్యా బలాలు ఇందులోకి చొప్పిస్తే కార్యక్రమ లక్ష్యం దెబ్బతింటుందని ఈ అత్యుక్షాహకులు గ్రహిస్తే మంచిది. అలాగే వామపక్ష మేధావులు కూడా ఇదేదో మోడిని విమర్శించటానికి మంచి అవకాశం వచ్చిందని అనుకోవటం కూడా మంచిదికాదు. ఇద్దరూ కలిసి ఈ పిలుపుని రాజకీయం చేయటం ఎంతవరకు సబబు? ఆలోచించండి. మీ అందరికీ దండాలు. కొంచెం సంయమనం పాటించండి మహానుభావులూ .
రాజకీయ నాయకుల నోటి దురద తీరింది
రాజకీయనాయకుల్ని వట్టిగా ఇంటిదగ్గర కోర్చోమంటే ఎట్లా చెప్మా? ఎటూ బయట తిరగటం లేదు. సామాజిక దూరం పేరుతో మంది మార్బలం లేకుండా అయిపోయింది. ఇక మిగిలిందల్లా నోటి దురద . ఇది కూడా బంద్ అయితే ఎట్లా? ఆ కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తున్నారంట ? ఇదో పెద్ద సామాజిక సమస్య అయ్యేటట్లుంది. ఇటీవల వార్తల్లో వచ్చింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మద్యం షాపులు మూసేయటం వలన కేరళలో రోజూ మద్యం తాగే వాళ్లకు సామాజిక సమస్య వచ్చిందంట. కరోనా మహమ్మారి తో చచ్చిపోయిన వాళ్ళకంటే వీళ్ళ ఆత్మహత్యలే ఎక్కువున్నాయంట. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కేరళ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందంట. అలాగే రాజకీయ నాయకుల నోళ్ళు కట్టేస్తే , బయట తిరగకుండా కట్టడి చేస్తే ఇదికూడా ముందు ముందు పెద్ద సామాజిక సమస్య అయ్యేటట్లు వుందంట.
అనుకోకుండా వీళ్ళందరికీ ఓ మంచి అవకాశం వచ్చింది. మోడీ వీడియో సందేశం తో రెచ్చిపోయారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు . మోడీ సందేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అవన్నీ అడియాశలయ్యాయని వాపోయారు. ఒకాయనయితే ఇదంతా మోడీ ఫోటో సందడి, ప్రచారాలు తప్పితే ఏమీ లేదనీ విమర్శించాడు. ఇంకో ఆయన మేమేదో వలస కార్మికులకి, పేద వాళ్లకి, అనాధలకి ఆర్ధిక పాకేజీ ప్రకటిస్తాడనుకుంటే తుస్సుమనిపించాడని హేళన చేసాడు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడయితే నేను లైట్లు ఆర్పనంటే ఆర్ప, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. జాగ్రత్త సుమా , ఒక్కసారి చెక్ చేసుకుందాం. వాళ్ళావిడ కామ్ గా లైట్లాపకుండా చూసుకోవాలి. అసలే మహిళా సాధికారతపై మోడీ ఉపన్యాసాలు దంచేస్తున్నాడు. ప్రజాస్వామ్యం కదా ఒక్కసారి జాగ్రత్తపడండి అదిర్ రంజన్ చౌదరి గారూ.
అసలు నాకు తెలియక అడుగుతానూ మోడీ అంతకుముందు రెండుసార్లు మాట్లాడినప్పుడు కూడా ఆర్ధిక పాకేజీ గురించి మాట్లాడలేదు కదా. మధ్యలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్భై ఐదువేల ఆర్ధిక ఉద్దీపనా పాకేజీ ప్రకటించింది, మోడీ కాదుకదా . వీళ్ళకు ఆమాత్రం తెలియదంటావా? లేక తెలిసే నాటకమాడుతున్నారా? ఏమో ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ నాయకులు బాగా అనుభవజ్ఞులు మనకు తెలిసినంత మాత్రం వాళ్లకు తెలియదని అనుకోలేం కదా. ఏదో మిషమీద నోటి దురద తీరింది. వాళ్ళ మానసిక సమస్యా తీరింది. హమ్మయ్య ప్రస్తుతానికి కొద్ది రోజులు పర్వాలేదు. లోలోపల మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పారంట. లేకపోతే పెద్ద సామాజిక సమస్య వచ్చిపడేది సుమా. ఆ తర్వాత ఇంట్లో కూడా గొడవపెట్టుకోవటం లేదంట. అందుకు ఇంటి ఆడపడుచులు కూడా మనసులో మోడీకి నమస్కారం పెట్టుకున్నారంట. విధి వైచిరీత్యమంటే ఇదేనేమో. బద్ధ శత్రువు మోడీ పరోక్షంగా వీళ్ళకు ఉపయోగపడటం .
సినిమా వాళ్ళే నయం
వీళ్ళ కన్నా సినిమా ఆర్టిస్టులు మెరుగనిపించారు. వాళ్ళు రాజకీయనాయకులు కాదుకదా. ఏ ప్రభుత్వం అధికారం లో వున్నా ఇటువంటి సందర్భంలో మద్దత్తు నివ్వటమే తెలుసు. రాజకీయం చేయటం తెలియదు. మంచి పాటలతో కరోనా మహమ్మారి పై ప్రజలకు హితబోధచేస్తున్నారు. కొంతమంది ఇంట్లో తీరికగా ఏం చేస్తున్నారో వీడియోలు తీసి రిలీజ్ చేస్తూ ప్రజలను టెన్షన్ నుంచి రిలాక్స్ చేస్తున్నారు. ఇప్పుడుకావాల్సింది ఇదే. చేతనయితే ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునివ్వటం లేకపోతే ఇంట్లో హాయిగా సినిమాలు చూస్తూ పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చేయటం. అంతేగానీ ప్రజల్ని గందరగోళ పరిచే ఆలోచనలు చేయొద్దు మహాప్రభో. మరొక్కసారి మీ అందరికి చేతులెత్తి నమస్కారాలు. ఎలాగోలాగా ఇంకో పది రోజులు ఇంట్లోనే గడపండే. బాబ్బాబు మీకు పుణ్యముంటుంది. లాక్ డౌన్ కి పూర్తిగా సహకరించండి. మనందరం కలిసి కరోనా మహమ్మారి ని తరిమేద్దాం. అందుకు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిద్దాం.
ఇవీ ఈ వారం ముచ్చట్లు. సరదాకోసంమాత్రమే ఎవరినీ ఉద్దేశించి మాత్రం కాదు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవు.
అన్నట్లు మరచాను . అందరం ఆదివారం దీపం/కాండిల్/టార్చ్ లైట్/ఫ్లాష్ లైట్ వెలిగిద్దాం, 130 కోట్లమందిమి ఒక్కటని చాటుదాం.
…….మీ రామ్
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: How to stay at home and relax
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com