
CM Jagan: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లభించే హోదా, గౌరవం ఆ దర్జాయే వేరు. గత కొన్నేళ్లుగా ఏపీలో వారికి ఎదురవుతున్న అవమానాలు, అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. పని రాక్షసుడని పేరుబడ్డ చంద్రబాబు ఏ రోజూ వారిని కించపరిచేలా వ్యవహరించలేదు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్, ఐపీఎస్ లకు జరుగుతున్న అవమానాలు అప్పుడప్పుడు మీడియా కంటపడుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే రెండు రోజుల క్రితం ఒక దళిత ఐఏఎస్ అధికారికి జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అఖిల భారత సర్వీస్ ఏ పోస్టులో ఉన్నప్పటికీ వారి జీతభత్యాల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. కార్యనిర్వాహక వ్యవస్థకు లోబడి వారు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి ఎంతో హోదా కలిగిన అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మాట విని మాట పడాల్సి రావడం శోచనీయం. ఇటువంటి అవమానాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎదుర్కొన్నారు. కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలోనూ ఐఏఎస్, ఐపీఎస్ లకు లభిస్తున్న గౌరవంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీగా గౌతం సవాంగ్ ఉన్నప్పుడు కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నీలం సాహ్ని కూడా జగన్ మాట విని కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కున్నారు. ఆ తరువాత పనిచేసిన సమీర్ శర్మ కూడా వర్చువల్ గా కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గతేడాది విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తులు సీఎం జగన్ ముందు మోకాళ్లపై కూర్చొని మాట్లాడాల్సినంతగా దిగజారిపోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఇక తాజాగా, చిలకలూరిపేటలో జరిగిన ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న సభలో పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటికి అవమానం జరిగింది. తనకు కలెక్టర్ గా అవకాశమిచ్చారని సభలో ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి ఆయనకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. అంత వరకు బాగానే ఉన్నా, కార్యక్రమం ముగిసిన అనంతరం జరిగిన ఫోటో సెషన్ లో ముఖ్యమంత్రి, మంత్రి విడదల రజినీ, డాక్టర్లు, మిగతా ఉన్నతాధికారులందరూ కుర్చీల్లో కూర్చొని ఫోటోలు దిగారు. ఒక్క కలెక్టర్ శివశంకర్ మినహా. దళితుడు కాబట్టే ఆయనకు కుర్చీ ఇవ్వలేదనే దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు లభించే గౌరవంపై ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బడుగులకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పుకుంటున్న జగన్, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు ఇస్తున్న గౌరవంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.
ఇంకెన్నాళ్లు ఇలా స్వామి భక్తి ప్రదర్శించాలని ఐఏఎస్ లు బయటకు కక్కలేక మింగలేక అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఐఏఎస్ అసోసియేషన్ స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.