Pawan Kalyan Janasena: ఏపీలో జనసేనకు ఆదరణ పెరిగిందా? వచ్చే ఎన్నికల అనంతరం నిర్మాణాత్మక శక్తిగా ఆ పార్టీ ఎదుగుతోందాదా? అధికారం దిశగా అడుగులు వేస్తోందా? గత ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన ఆ పార్టీకి ఇంతలా ఆదరణ పెరగడానికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? అటు సర్వేలు, ఇటు నిపుణులు అందించిన రిపోర్టు ఏమిటి? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ లీగల్ సెల్ సమావేశంలో వైసీపీకి కేవలం 45 నుంచి 69 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నివేదికలు అందిన తరువాతే పవన్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. జనసేనకు ఆదరణ ఉన్నా దానిని బలోపేతం దిశగా మలుచుకోలేకపోతున్నారని నివేదికలు పవన్ కు అందినట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గాడిలో పెట్టి తరువత ప్రజా క్షేత్రంలోకి దిగాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కొద్ది నెలల ముందు నుంచి సన్నాహాలు చేసుకుంటూ వచ్చిన బస్సు యాత్రను సైతం ఆయన వాయిదా వేసుకున్నారు.

అయితే ఇప్పుడు సర్వే సంస్థలు, నిపుణుల నివేదికలు పవన్ కు అందాయని ప్రచారం సాగుతోంది. వైసీపీ కేవలం 45 నుంచి 69 స్థానాలకే పరిమితం కానుందని తెలియడంతో.. అసలు జనసేనకు వచ్చే స్థానాలు ఏమిటన్నది ఇప్పడు హాట్ టాపిక్ మారింది. అయితే వైసీపీ మాత్రం అధికారానికి దూరం కావడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. అదే జరిగితే అధికారంలోకి ఎవరూ వస్తారన్నది ప్రశ్న. వైసీపీకి పోను మిగతా 100కు పైగా స్థానాలున్నాయి. అవి టీడీపీ, జనసేన పంచుకుంటాయి. జనసేనతో పోల్చుకుంటే టీడీపీకి సంస్థాగత బలం ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. అంత మాత్రాన అధికారం అందిపుచ్చుకునేంతగా రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.అందుకే అప్పుడు జనసేన కీలకం కానుందని చెబుతున్నారు.
కాస్తా కృషిచేస్తే జనసేన జెండా రెపరెపలాడడం ఖాయమని పవన్ గంటాపధంగా చెబుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ ఆయన అధికారం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏకంగా వైసీపీకి దక్కే స్థానాలను గణంకాలతో చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో జనసేనకు బలం అమాంతం పెరిగిందని చెప్పడం ద్వారా గెలుపొందే నిర్థిష్టమైన స్థానాల జాబితా ఆయన వద్ద ఉన్నట్టు అవగతమవుతోంది. కానీ ఒకవైపు టీడీపీతో పొత్తు అంశం పెండింగ్ లో ఉన్నందున ఆయన ఆ జాబితాను మాత్రం బయటపెట్టడం లేదు. పొత్తు అంశం తేలకున్నా సంఖ్యాబలం ప్రకటిస్తే అది అధికార పక్షానికి లాభిస్తుందని పవన్ భావించినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న భావనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఎన్నడూ లేనంతగా పవన్ నోట జనసేనకు అధికారం తధ్యమన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో బలమైన అభ్యర్థులను దించుతామన్న మాట కూడా వినవస్తోంది. అంటే జనసేనకు బలం పెరిగిందని.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా విజయం అందిపుచ్చుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలమవుతోంది. కానీ అధికారమే ధ్యేయమన్న మాట వినిపించలేదు. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాలని పవన్ ప్రయత్నించారు. కానీ ఎప్పుడూ ఫక్తు రాజకీయ పక్షంలా జనసేనను తీర్చిదిద్దలేదు. కానీ ఈ సారి మాత్రం వైసీపీకి అధికారం దూరం చేయ్యాలంటే మాత్రం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించక తప్పదని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

ముఖ్యంగా కోస్తా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై వపన్ ఫోకస్ పెంచారు. అటు సామాజికవర్గపరంగా కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువ. గత ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో కాపుల్లో మెజార్టీ వర్గం జగన్ వైపు నడిచినా.. అధికారంలోకి వచ్చాక తమను అన్నివిధాలా దగా చేశారన్న ఆవేదన, బాధ, కసి కాపుల్లో ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేశామన్న ఆవేదన ఉంది. అందుకే ఈసారి కాపుల ఓట్లు పవన్ కు ఏకపక్షంగా పడే అవకాశమైతే ఉంది. అందుకే కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలు వైసీపీ ఓటమి జాబితాలో ఉన్నాయి. అయితే అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా వాటిని జనసేన ఖాతాలో వేసేందుకు మాత్రం పవన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతానికైతే జనసేనకు వచ్చే ఎమ్మెల్యేల సీట్లను బయటపెట్టకపోయినా.. వైసీపీకి వచ్చే స్థానాలు బయటకు వెల్లడించి.. జనసేన పుంజుకుంటుందన్న సంకేతాలనైతే మాత్రం పవన్ ప్రజలకు పంపించడంలో సఫలీకృతమయ్యారు.
Alos Read: VijayaSai Reddy Comments On RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
[…] Also Read: Pawan Kalyan Janasena: జనసేన నిలిచి, గెలిచే సీట్లు ఎ… […]