AP Govt Advisors : “ ఒకాయనకు వ్యవసాయం గురించి తెలియదు. కానీ వ్యవసాయ శాఖకు సలహాదారుడు. ఇంకొకాయనకు కంప్యూటర్ గురించి ఓనమాలు తెలియవు. కానీ సాంకేతిక శాఖకు సలహాదారుడు. మరొకాయన ప్రైవేటు కంపెనీలు నిర్వహించే జాబ్ మేళాకు ప్రభుత్వ సలహాదారుడు. సలహాలు ఇవ్వడం తెలియని సలహాదారులు ఏపీ ప్రభుత్వంలో కోకొల్లలు. ప్రభుత్వానికే లెక్క తెలియనంత మంది సలహాదారులు“ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన సలహాదారుల పదవి పై స్పెషల్ ఫోకస్.

దేశంలో ఏ ప్రభుత్వానికి లేనంత మంది ఏపీ ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు. ఒక్కో సలహాదారుడికి లక్షల్లో జీతం. ప్రభుత్వ సౌకర్యాలు అదనం. సలహాదారులంటే సంబంధిత శాఖలోనో, వృత్తిలోనో నైపుణ్యం ఉన్నవారు. వారిని ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుంటుంది. కానీ ఇంటర్ పాస్ కాని వారు వ్యవసాయ శాఖకు, కంప్యూటర్ తెలియని వారు సాంకేతిక శాఖకు సలహాదారులుగా నియమించడం మాత్రం ఏపీలోనే జరిగింది.
ఏపీలో సలహాదారులను నియమించడం పై ప్రతిపక్షం హైకోర్టు తలుపుతట్టింది. ఆ అంశం పై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మంది సలహాదారుల్ని నియమించిందో , వారికి ఎంత జీతం చెల్లిస్తున్నారో కోర్టు ముందు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం తమ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఏయే శాఖలో ఎంత మంది సలహాదారులు ఉన్నారో వివరాలు పంపమని ఆయా శాఖలకు లేఖలు రాసింది. కానీ ఆయా శాఖలకు కూడా ఆ వివరాలు తెలిసి ఉండాలి కదా. ప్రభుత్వమే సలహాదారుల్ని నియమించింది. కానీ తమకు లెక్కలు తెలియవని చెప్పి, ఆయా శాఖల ఉన్నతాధికారుల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తోంది.
ప్రభుత్వం రాసిన లేఖలు చూసి ఆయా ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకున్నారట. సలహాదారులందరినీ నియమించింది ముఖ్య సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ హైకోర్టు ముందు తప్పించుకోవడానికి అధికారుల్ని బలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఉన్నతాధికారులు వాపోతున్నారట. ప్రస్తుత ప్రభుత్వంలో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి తయారయిందట. సలహాదారుల వల్ల కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. ప్రభుత్వం సలహాదారుల పదవిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. తమకు నచ్చిన వారికి `వేసెయ్ వీరతాడు` అన్నట్టు సలహాదారుల పదవి కట్టబెడుతోంది.