Modi AP Tour: ప్రధాని మోదీ ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన నేతల్లో ఒకరు. భారత రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు. బీజేపీని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దిన పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పార్టీని విస్తరించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన పాచిక పారలేదు. అటు పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఏపీలో బీజేపీ బలోపేతం కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణ, ఒడిశా, కర్నాటకలో విస్తరించిన పార్టీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన స్థాయిలో పరిణితి కనబరచలేకపోతోంది. తడబడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీ పరిస్థితిపై హైకమాండ్ పోస్టుమార్టం చేసింది. ఇక్కడ మిత్రధర్మం పాటించే బలపడలేకపోయామన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీ పైనే ఫోకస్ పెంచింది.

ఇటీవల మోదీ రాష్ట్రంలో పర్యటించారు. రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే పైకి ఇది అధికార పర్యటనకే కానీ.. లోలోపల మాత్రం పక్కా రాజకీయ వ్యూహంతో సాగిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రధాని తన పర్యటనతో ఏపీ రాజకీయ సమీకరణలనే మార్చేశారు. అటు అధికార పక్షం వైసీపీని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని డిఫెన్స్ లో పడేశారు. ఇప్పటివరకూ బీజేపీని కార్నర్ చేసుకొని ఏపీలో ప్రాంతీయ పార్టీలు తమ ఆట చూపాయి. ఇప్పుడదే ఫార్ములాతో ప్రాంతీయ పార్టీల ఆటకట్టించారు ప్రధాని మోదీ. పవన్ అనే అస్త్రాన్ని ప్రయోగించి టీడీపీ, వైసీపీ వెన్నులో వణుకు పుట్టించారు.
వాస్తవానికి మోదీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేశారు. కానీ అధికార వైసీపీ మాత్రం విశాఖ ప్రత్యేక రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టు, గిరిజన యూనివర్సిటీ వంటి వాటి శంకుస్థాపనకు ప్రధాని విచ్చేస్తున్నారని ఆర్భాటపు ప్రకటనలు చేసింది. అటు అనుకూల మీడియాలో కథనాలు రాయించి మొత్తం క్రెడిట్ ను తనఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వైసీపీ పన్నాగాన్ని ముందే గ్రహించిన బీజేపీ హైకమాండ్ పెద్దలు మొత్తం షెడ్యూలే మార్చేశారు. ప్రధాని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభానికే పరిమితమయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాట్లు, జన సమీకరణ చేస్తే తమకు ఎలాంటి పొలిటికల్ అడ్వాంటేజ్ లేకుండా పోయిందని వారు తెగ బాధపడుతున్నారు.

పనిలో పనిగా ప్రధాని మోదీ తన మిత్రుడు పవన్ ను ఆహ్వానించారు. కొద్దిసేపు భేటీ అయ్యారు. ఇది ప్రోటోకాల్ ఏర్పాట్లు చేసిన వైసీపీకి మింగుడు పడడం లేదు. అటు టీడీపీకి ఊపిరాడనివ్వలేదు. ప్రధానితో భేటీ తరువాత అధికార పక్షంపై పవన్ మరింత దూకడు కనబరుస్తుండగా… తనకు ఒక చాన్సివ్వాలని అభ్యర్థించడం ద్వారా టీడీపీని కూడా డిఫెన్స్ లోపడేశారు.అయితే పవన్ లో మార్పునకు ప్రధాని మోదీ యే కారణమని వైసీపీ, టీడీపీ అనుమానిస్తున్నాయి. టీడీపీ నుంచి పవన్ ను దూరం చేశారని వైసీపీ తొలుత సంతోషపడినా.. తమపై పవన్ ను ఊసిగొల్పడాన్ని మాత్రం జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రధాని ఏపీలో అడుగుపెట్టిన వరకూ టీడీపీ, జనసేనల మధ్య సానుకూల వాతావరణం ఉండేది. అటు జగన్ కూడా బీజేపీ పెద్దలు తన వెంట ఉన్నారన్న నమ్మకంతో ఉండేవారు. అయితే అవన్నీ పవన్ తో ప్రధాని భేటీతో పటపంచలయ్యాయి. వైసీపీ, టీడీపీ ఆశలు నీరుగారిపోయాయి.